ఆరోగ్య అత్యవసరం ఏర్పడిన ప్రతిసారీ వెంటనే ఆసుపత్రిలో చేరకపోవచ్చు. కొన్నిసార్లు చికిత్సకు ముందు వైద్య పరీక్షలు అవసరం అవుతాయి. ఉదాహరణకు గుండెకు సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆసుపత్రిలో చేరకముందే.. 2డీ ఎకో, టీఎంటీ, యాంజియోగ్రఫీ అనేక పరీక్షలు ఉంటాయి. వీటికీ వేల రూపాయలు ఖర్చు అవుతాయి. వీటన్నింటినీ చెల్లించేలా బీమా పాలసీ ఉండాలి. వీటిని చెల్లించినప్పుడే పాలసీదారుడిపై ఆర్థిక భారం తగ్గుతుంది. సొంతంగా భరించాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది తప్పదు.
బీమా పాలసీలోనే భాగంగా క్లెయిం చేసుకోని ఏడాది తర్వాత వైద్య పరీక్షలకు అవకాశం కల్పిస్తున్నాయి బీమా సంస్థలు. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఈ వెసులుబాటు ఉన్న బీమా పాలసీల వల్ల పాలసీదారుడికి వైద్య పరీక్షలు చేయించుకున్నప్పుడు బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీర్ఘకాలంలో చికిత్స ఖర్చును తగ్గించేందుకూ ఇది ఉపయోగపడుతుంది.
రోజువారీ చికిత్సలూ ఇప్పుడు సర్వసాధారణం అయ్యాయి. కాబట్టి, బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఓపీడీ చికిత్సలకూ పరిహారం ఇచ్చేలా ఉండాలి. దీంతోపాటు ప్రత్యామ్నాయ వైద్య చికిత్స విధానాలకూ బీమా పాలసీ అనుమతించాలి. అలోపతితో పాటు హోమియోపతి, ఆయుర్వేద, యునాని వంటి వైద్య చికిత్సల వైపు ఇప్పుడు ఎంతోమంది వెళ్తున్నారు. ఇలాంటి చికిత్సల ఖర్చులనూ చెల్లించేలా పాలసీని ఎంచుకోవాలి.