భారత్‌లోని మొత్తం సంపదలో 40 శాతం కేవలం ఒకశాతం ధనవంతుల దగ్గరే ఉందని ప్రముఖ నివేదిక తెలిపింది. అట్టడుగున ఉన్న సగం జనాభా వద్ద దేశ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే ఉందని పేర్కొంది. ప్రముఖ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ 'సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్' పేరిట భారత్‌లోని ఆర్థిక అసమానతలపై సోమవారం నివేదిక విడుదల చేసింది. దావోస్‌లో జరుగుతున్న 'ప్రపంచ ఆర్థిక వేదిక' వార్షిక సమావేశం సందర్భంగా ఆక్స్‌ఫామ్ ఈ నివేదికను బహిర్గతం చేసింది.
నివేదికలోని కీలకాంశాలు..
- తొలి 100 మంది భారతీయ బిలియనీర్లపై 2.5 శాతం లేదా మొదటి 10 మంది బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే.. బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలలకు తీసుకురావడానికి అవసరమైన డబ్బు మొత్తం సమకూరుతుంది.
- 2017- 2021 మధ్య పెరిగిన బిలియనీర్ గౌతమ్ అదానీ సంపదపై ఒకసారి విధించే పన్నుతో రూ. 1.79 లక్షల కోట్ల నిధుల్ని సమీకరించవచ్చు. ఇది దేశంలో ప్రాథమిక పాఠశాలల్లో కావాల్సిన 50 లక్షల మంది ఉపాధ్యాయులకు ఏడాదిపాటు వేతనాలివ్వడానికి సరిపోతుంది.
- భారత్‌లోని బిలియనీర్లపై ఒకసారి రెండు శాతం పన్ను విధిస్తే రూ.40,423 కోట్ల ఆదాయం వస్తుంది. దీంతో దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలందరికీ వచ్చే మూడేళ్ల పాటు పోషకాహారం అందించవచ్చు.
- దేశంలోని 10 మంది సంపన్న బిలియనీర్లపై ఒకేసారి 5 శాతం పన్ను విధిస్తే వచ్చే రూ. 1.37 లక్షల కోట్లు.. 2022-23 సంవత్సరానికిగానూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (రూ. 86,200 కోట్లు), ఆయుష్ మంత్రిత్వ శాఖ (రూ. 3,050 కోట్లు) అంచనా వేసిన నిధుల కంటే 1.5 రెట్లు ఎక్కువ.
- లింగ అసమానతల విషయానికి వస్తే నివేదిక ప్రకారం.. ఒక పురుష కార్మికుడు సంపాదించే ప్రతి రూపాయికి మహిళా కార్మికులు కేవలం 63 పైసలు మాత్రమే పొందుతున్నారు.
- షెడ్యూల్డ్ కులాలు, గ్రామీణ ప్రాంత కార్మికుల సంపాదనల్లో వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది. అగ్ర సామాజిక వర్గాలు సంపాదిస్తున్న దానితో పోలిస్తే షెడ్యూల్డ్ కులాలు 55 శాతం మాత్రమే పొందుతున్నాయి. గ్రామీణ ప్రాంత కార్మికులు పట్టణాల్లో వారితో పోలిస్తే 2018- 2019 మధ్య సగం మాత్రమే సంపాదించారు.
- కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి 2022 నవంబరు వరకు దేశంలో బిలియనీర్ల సంపద 121 శాతం పెరిగింది. రోజుకు రూ. 3,608 కోట్ల సంపద జతయ్యింది.
- 2021-22లో 'వస్తు సేవల పన్ను' ద్వారా వచ్చిన మొత్తం రూ.14.83 లక్షల కోట్లలో దాదాపు 64 శాతం.. సంపదలో అట్టడుగున ఉన్న 50 శాతం జనాభా నుంచి వచ్చింది. జీఎస్‌టీ మొత్తం ఆదాయంలో కేవలం 3 శాతం మాత్రమే తొలి పది మంది బిలియనీర్ల నుంచి వస్తోంది.
- భారతదేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102 కాగా 2022 నాటికి 166కు పెరిగింది.
- భారతదేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద 660 బిలియన్ల డాలర్ల (రూ. 54.12 లక్షల కోట్లు)కు చేరుకుంది. దీనితో కేంద్ర బడ్జెట్‌కు 18 నెలలకు పైగా నిధులు సమకూర్చవచ్చు.
భారతదేశంలో అసమానతల ప్రభావాన్ని అంచనా వేయడానికి గుణాత్మక, పరిమాణాత్మక సమాచారంతో కూడిన మిశ్రమ డేటాను వినియోగించుకున్నట్లు ఆక్స్‌ఫామ్ తెలిపింది. అలాగే ఫోర్బ్స్, క్రెడిట్ సూయిజ్ వంటి ఇతర మార్గాల ద్వారానూ సమాచారాన్ని సేకరించినట్లు వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఎస్, కేంద్ర బడ్జెట్ పత్రాలు, పార్లమెంట్‌లో సభ్యుల ప్రశ్నలు.. నివేదికలో చేసిన వ్యాఖ్యలకు ఆధారమని పేర్కొంది.