Owners Rights Against Tenants In India :మన దేశంలో చాలా మంది అద్దె ఇళ్లలో నివసిస్తుంటారు. ఇలా అద్దె ఇళ్లలో నివసించేవారు గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. ఇక వీరికి ఇంటిని అద్దెకిచ్చి ఆదాయాన్ని పొందుతూ ఉంటారు చాలా మంది ఇంటి యజమానులు. అయితే చాలా వరకు యజమాని, అద్దెదారుని మధ్య సంబంధాలు బాగానే ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో అద్దెదారులు అద్దె చెల్లించకుండా, ఇల్లు ఖాళీ చేయకుండా యజమానులను ఇబ్బందికి గురిచేస్తారు. ఇలాంటి సందర్భాల్లో యజమానుల కోసం కొన్ని చట్టాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రెంట్ అగ్రిమెంట్ తప్పనిసరి..
Landlord Tenant Rental Agreement : యజమాని తన ఇంటిని అద్దెకు ఇచ్చే ముందే అద్దెదారుడితో రెంట అగ్రిమెంట్‌పై సంతకం చేయించుకోవాలి. అందులో అద్దె మొత్తం, గడవు తేదీ, ఏడాది అద్దె పెంపు వంటి వాటి గురించి స్పష్టంగా రాసుకోవాలి. దీంతో పాటు ఒకవేళ అద్దెదారుడు అద్దె చెల్లించకపోతే ఎదురయ్యే పరిణామాలను అందులో పొందుపర్చాలి. అద్దెదారుడు సంతకం చేసిన రెంట్ అగ్రిమెంట్‌ను యజమాని జాగ్రత్తగా సమీక్షించుకోవాలి. ఇలా పకడ్బందీగా ఒప్పందం చేసుకుంటే.. యజమానికి అనేక చట్టపరమైన ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. అద్దెదారులపై యజమాని అనుసరించే చట్టపరమైన చర్యకు ఈ పత్రం పునాదిగా పనిచేస్తుంది.
అడ్వాన్స్ అద్దె.. ఆర్థిక భరోసా..
అద్దెదారులు ఇంట్లోకి వెళ్లే ముందు యజమానికి 2-3 నెలల (కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ) అద్దెను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. అద్దె చెల్లించనప్పుడు లేదా ఇంటికి ఏదైనా నష్టం జరిగినప్పుడు ఈ డిపాజిట్ యజమానికి ఆర్థిక భద్రతగా పనిచేస్తుంది. ఈ డిపాజిట్ యజమాని వద్ద ఉండటం వల్ల, అద్దెదారులు ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా అద్దె ఒప్పందం ప్రకారం వారి బాధ్యతలను కూడా నెరవేరుస్తారు.
లీగల్ నోటీసు..
Legal Notice To Tenant : అద్దెదారుడు గడువు తేదీలోగా అద్దె చెల్లించడంలో విఫలమైతే, ముందుగా అతడితో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేలా ప్రయత్నించండి. ఒకవేళ అలా సాధ్యం కాదని భావిస్తే.. అద్దె చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారికి లీగల్ నోటీసు పంపవచ్చు. కాంట్రాక్ట్/అద్దె ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు గుర్తుచేస్తూ అద్దెదారుడికి యజమాని చట్టబద్ధమైన నోటీసును పంపవచ్చు. ఆ నోటీసులో చెల్లించని అద్దె వివరాలు, చెల్లింపు గడువు తేదీ ఉండాలి. నోటీసుకు స్పందించకపోతే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలను కూడా వివరించాలి. నోటీసు ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం కింద నిర్దేశించిన చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసు పంపడం తప్పనిసరి. పోస్ట్ అద్దెదారులకు అందిందని నిర్ధరించుకోండి. 15 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత కూడా అద్దెదారుడు రెంట్ చెల్లించడానికి నిరాకరిస్తే, అద్దె నియంత్రణ కోర్టు లేదా సివిల్ కోర్టులో అద్దెదారుడిని విచారించడానికి కోర్టు అనుమతిని కోరవచ్చు.
చర్చలు
అయితే లీగల్ నోటీసులు, కోర్టు విచారణలకు ముందు మధ్యవర్తిని పంపి చర్చిస్తే సమస్య పరిష్కారం అవుతుందా లేదా అన్నది ఆలోచించాలి. ఈ చర్చల్లో ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలను కనుగొనే అవకాశం ఉంటుంది. భారత్ అనేక నగరాల్లో మధ్యవర్తిత్వ కేంద్రాలు, ఫోరమ్‌లు ఉన్నాయి. ఇలాంటి వివాదాల సామరస్య పరిష్కారానికి మన దేశంలో మంచి వేదికలుగా ఉపయోగపడతాయి.