New Credit Card User Tips : చేతిలో డబ్బు లేకున్నా.. అప్పటికప్పుడే కొనుగోళ్లు జరిపేందుకు క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. వ్యక్తుల ఆదాయం, క్రెడిట్ స్కోరు, లోన్ హిస్టరీ ఇలాంటివన్నీ క్రెడిట్ కార్డు విషయంలో కీలకంగా వ్యవహరిస్తాయి. దాంతో పాటు కార్డు వచ్చాక బిల్లులను ఎలా చెల్లిస్తున్నారన్నది కూడా క్రెడిట్ స్కోరుపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో చేరిన వారికి ఎలాంటి లోన్ ఉండే అవకాశం లేదు. కాబట్టి క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి.
కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి - కొత్త క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు చిట్కాలు
New Credit Card User Tips : కొత్తగా ఉద్యోగంలో చేరారా? క్రెడిట్ కార్డును ఇస్తామంటూ బ్యాంకులు ఆఫర్లు ఇస్తున్నాయా? వివిధ రకాల కార్డ్ పేర్లు చెప్పి.. మిమ్మల్ని ఆకట్టుకనే ప్రయత్నం చేస్తున్నాయా? క్రెడిట్ కార్డ్ తీసుకునే ఉద్దేశం మీకుంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి. తొలిసారి క్రెడిట్ కార్డు తీసుకునే వారు ఏయే అంశాలను పరిశీలించాలో తెలుసుకుందాం.
కొంతమంది వాయిదాల్లో సెల్ ఫోన్లు కొనుగోలు చేయడం లాంటివి చేసి ఉండొచ్చు. వారికి ఇప్పటికే కొంత క్రెడిట్ స్కోరు ఉండి ఉంటుంది. లోన్లు తీసుకొని, మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న వారు.. క్రెడిట్ కార్డును సులభంగానే పొందొచ్చు. క్రెడిట్ స్కోరు 750 దాటితే మీరు మంచి ఖాతాదారు కింద లెక్కకట్టవచ్చు. స్థిరమైన ఆదాయం లేనివారు.. కార్డు తీసుకునే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇలాంటి వారు సాధారణ క్రెడిట్ కార్డు బదులు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారిత క్రెడిట్ కార్డును పరిశీలించడం మంచిది.
- క్రెడిట్ కార్డు మీకు ఎందుకు అవసరం? రోజువారీ ఖర్చుల కోసమా? లేదా ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఉపయోగించుకుంటారా? అనే విషయాన్ని ముందుగా నిర్ణయించుకోండి. కార్డు తీసుకునే సమయంలో మీ అవసరం ఏమిటి? తీసుకుంటున్న కార్డు మీకు ఆ మేరకు ప్రయోజనకరంగా ఉందా అన్నది తెలుసుకోవాలి.
- మీరు ఆన్‌లైన్‌లో ఎక్కువగా కొనుగోళ్లు చేస్తుంటే.. అధికంగా రాయితీలను అందిస్తున్న కార్డు ఏదో ముందు పరిశీలించండి. కొత్తతరం బ్యాంకులు పలు ప్రత్యేక ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డులనూ సైతం తొందరగానే ఇస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకోవాలంటే ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లలోకి వెళ్లి చూడండి.
- క్రెడిట్ కార్డు తీసుకున్న వారు ఖర్చుల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఎప్పుడో ఉపయోగపడతాయని అనవసరంగా కొనుగోళ్లు చేయొద్దు. ఇప్పటికిప్పుడు మీకు ఏది అవసరమో వాటిని కొనేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి.
- క్రెడిట్ కార్డ్ సంస్థలు.. ఎలక్ట్రానిక్ వస్తువులు, పుడ్ డెలివరీ కంపెనీలు, ఇతర కొన్ని బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకొని రాయితీలు ఇస్తుంటాయి. అవి ఎంత మేరకు మీకు ఉపయోగపడతాయన్నది ముఖ్యమైన విషయమే. క్రెడిట్ కార్డు ఉంది కదా అని అనవసరంగా వాటిపై ఖర్చులు చేయవద్దు.
- కార్డు తీసుకునే సమయంలో ఎలాంటి వార్షిక రుసుము ఉండదని బ్యాంకులు చెబుతుంటాయి. కాకపోతే.. దీనికి కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. సంవత్సర కాలంలో నిర్ణీత మొత్తంలో కొనుగోళ్లు చేసినప్పుడు మాత్రమే ఈ ప్రయోజనం అందుతుంది.
- ప్రముఖ బ్రాండ్లతో కలిసి బ్యాంకులు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఆయా బ్రాండ్లను ఎక్కువగా మీరు వాడితేనే ఈ తరహా కార్డులతో మీకు ఉపయోగం ఉంటుంది.
- గడువు తేదీలోపు బిల్లులు చెల్లించినప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డు వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. కనీస చెల్లింపు, బిల్లు బాకీ పడటంలాంటి సందర్భాల్లో అధిక వడ్డీని కట్టాల్సి ఉంటుంది.
- క్రెడిట్ కార్డును ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు తీసుకోవద్దు. దీనిపై వార్షిక వడ్డీ 36-40 శాతం వరకూ విధించే అవకాశాలు ఉన్నాయి.
- ఒకవేళ మీ దగ్గర ఇప్పటికే క్రెడిట్ కార్డు ఉండి.. రెండో కార్డు తీసుకోవాలి అనుకుంటే కాస్త ఆలోచించండి. మరీ అవసరమతైనే రెండో కార్డు కోసం ప్రయత్నించండి. తక్కువ పరిమితి ఉన్న రెండుమూడు కార్డులకన్నా.. ఎక్కువ పరిమితి ఉన్న ఒక కార్డే ఉత్తమమని గుర్తుంచుకోండి.
- ఇవీ చదవండి:
- క్రెడిట్ కార్డ్‌పై లోన్ తీసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- Credit card Tcs India : క్రెడిట్ కార్డ్‌కు కొత్త రూల్స్.. అలా వాడితే ఇకపై 20% ట్యాక్స్!