తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.1353 కోట్లతో దుబాయ్​లో మరో విల్లా కొన్న అంబానీ.. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద డీల్​!

Mukesh Ambani Villa In Dubai : తమ వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించే యోచనలో ఉన్న అంబానీ ఇటీవల విదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. తాజాగా దుబాయ్‌లో మరో విల్లాను కొన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి వెల్లడించారు.

mukesh ambani new villa in dubai
దుబాయ్‌లో అంబానీకి మరో విల్లా

By

Published : Oct 19, 2022, 9:45 PM IST

Mukesh Ambani Villa In Dubai : భారత కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ దుబాయ్‌లో మరో విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ అరబ్‌ నగరంలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ డీల్‌ అని తెలుస్తోంది. దాదాపు 163 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1353 కోట్లు) వెచ్చించి దీన్ని కొన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ కథనం ప్రచురించింది. దుబాయ్‌ ల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌ గత వారంలో 163 మిలియన్‌ డాలర్ల ప్రాపర్టీ డీల్‌ జరిగినట్లు రికార్డు చేసింది. అయితే, ఎవరు కొనుగోలు చేశారన్న విషయాన్ని మాత్రం బహిర్గతం చేయలేదు.

దుబాయిలోని పామ్‌ జుమైరా లో ఉన్న ఈ విల్లాను ముకేశ్ అంబానీ గత వారమే కొనుగోలు చేసినట్లు సమాచారం. గతంలోనూ దాదాపు రూ.643 కోట్లు ఖర్చు చేసి అంబానీ ఇదే ప్రాంతంలో ఓ విల్లాను కొన్న విషయం తెలిసిందే. దుబాయ్‌ చరిత్రలో అదే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ డీల్‌ అని అప్పట్లో వార్తలొచ్చాయి. తాజా కొనుగోలు విలువ రూ.1000 కోట్లు దాటడం గమనార్హం. తొలుత కొన్న ఈ విల్లా ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ కోసమని అప్పట్లో పలు పత్రికలు పేర్కొన్నాయి. చెట్టు ఆకారంలో ఉండే ఈ పామ్‌ జుమైరా.. దుబాయిలో కృతిమంగా ఏర్పాటుచేసిన దీవుల సముదాయం. ఈ ప్రాంతంలోనే ఓ బీచ్‌ సైడ్‌ లగ్జరీ విల్లాను అంబానీ తాజాగా కొనుగోలు చేశారట! కువైట్‌కు చెందిన ధనవంతుడు మహమ్మద్‌ అల్‌షాయా నుంచి దీన్ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. అల్‌షాయా కుటుంబం స్టార్‌బక్స్‌, హెచ్‌అండ్‌ఎం, విక్టోరియాస్‌ సీక్రెట్‌ వంటి ప్రముఖ బ్రాండ్లకు ప్రాంతీయ ఫ్రాంఛైజీలను నిర్వహిస్తోంది.

అంబానీ విల్లా కొన్న ప్రాంతం

అంబానీ ఇటీవల విదేశాల్లో పలు ఆస్తులను సొంతం చేసుకోవడం గమనార్హం. సింగపూర్‌లో కుటుంబ కార్యాలయం తెరవడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయని గత నెలలోనే ఓ కీలక వ్యక్తి తెలిపారు. మరోవైపు గతేడాది బ్రిటన్‌లో ఓ విశాల సౌధాన్ని కొనుగోలు చేశారు. లండన్‌లో బకింగ్‌హాంషైర్‌ వద్ద ఉన్న 300 ఎకరాల్లోని ‘స్టోక్‌ పార్క్‌’ను రూ.592 కోట్లతో కొనుగోలు చేశారు. దీన్ని పెద్ద కుమారుడు ఆకాశ్ కోసం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో మాండరిన్‌ ఓరియెంటల్‌ న్యూయార్క్‌లోనూ 73.4 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ముకేశ్‌ అంబానీ కుటుంబం ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో నిర్మించిన ఆకాశహర్మ్యం ‘యాంటిలియా’లో నివాసముంటోంది. 27 అంతస్తుల ఈ భవనంలో మూడు హెలిపాడ్లు, 168 కార్ల కోసం పార్కింగ్‌, 50 మంది కూర్చుని చూసే సినిమా థియేటర్‌, 9 ఎలివేటర్లు ఇతర అధునాతన సదుపాయాలున్నాయి.

పుంజుకుంటున్న దుబాయ్‌ స్థిరాస్తి రంగం..
ప్రపంచ కుబేరులను ఆకర్షించేందుకు దుబాయ్‌ పాలనా యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. గత ఏడేళ్లుగా అక్కడ స్థిరాస్తి రంగ వృద్ధి క్షీణిస్తూ వస్తోంది. దీంతో విదేశీయులకు ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యం కల్పించడం, కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం తీసుకున్న పటిష్ఠ చర్యలతో తిరిగి ఈ అంతర్జాతీయ పర్యాటక నగరం పూర్వవైభవం సంతరించుకుంటోంది. యూఏఈ జనాభాలో విదేశీయుల వాటాయే 80 శాతం. దశాబ్దాలుగా వీరే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు రంగంలో పనిచేసే వీరు స్థిరాస్తి రంగంలో భారీ ఎత్తున పెట్టుబడి పెడుతుంటారు. గత ఏడాది కాలంలో ప్రైమ్‌ ప్రాపర్టీ ధరలు 70 శాతానికి పైగా పెరిగినట్లు గతనెలలో అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు విదేశీయులు పెద్ద ఎత్తున షాపింగ్‌ కూడా చేస్తుంటారు.

ABOUT THE AUTHOR

...view details