మాంద్యం భయాలతో వ్యయాలను తగ్గించుకునే ఉద్దేశంతో సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. చివరి త్రైమాసికం ఫలితాలు ప్రకటించడానికి వారం ముందు మరికొందరు ఉద్యోగులపై వేటు వేసింది. మొత్తం ఉద్యోగుల్లో 5 శాతానికి సమానమైన.. దాదాపు 10,000 మందిని తొలగించినట్లు మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం.. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరాలు వెళ్లడించింది. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ బుధవారమే మొదలైనట్లు సంస్థ వెల్లడించింది.
ఉద్వాసనకు గురయ్యేవారిలో మానవ వనరులు, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. సంస్థ ఆర్థిక పరిస్థితులు, వినియోగదారుల ప్రాధాన్యాల్లో మార్పులు వంటి కారణాల వల్ల ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని పేర్కొంది. లీజుకు తీసుకున్న ఆఫీసు స్థలాలపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ చర్యల ఫలితంగా సంస్థకు 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9,752 కోట్లు) ఆదా అవుతాయని వివరించింది. కంపెనీ లెక్కల ప్రకారం జూన్ 30 నాటికి మైక్రోసాఫ్ట్‌లో 2,21,000 మంది పనిచేస్తున్నారు. 1,22,000 మంది అమెరికాలో, 99,000 మంది ఇతర దేశాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది మైక్రోసాఫ్ట్ రెండుసార్లు ఉద్యోగులను తొలగించింది. అక్టోబర్‌లోనే 1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై చెప్పింది.