తెలంగాణ

telangana

ETV Bharat / business

అత్యవసరంగా డబ్బులు కావాలా?.. FD బ్రేక్‌ చేయకుండా లోన్​ పొందండిలా! - ఫిక్స్​డ్ డిపాజిట్ వడ్డీ రేటు

Loan On FD : అత్యవసర సమయాల్లో డబ్బు అవసరమైతే చాలా మంది ఫిక్స్​డ్ డిపాజిట్​ను బ్రేక్​ చేస్తుంటారు. కానీ అలా అవసరం లేదు. ఎందుకంటే.. ఎఫ్‌డీపైనే లోన్​ తీసుకునే వెసులుబాటు ఉంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

loan on fd
loan on fd

By

Published : May 10, 2023, 7:44 AM IST

Loan On FD : ఇటీవల కాలంలో ఫిక్స్​డ్​ డిపాజిట్లపై రుణాలకు ఆదరణ పెరుగుతోంది. రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఏప్రిల్‌ బులెటిన్‌ ప్రకారం 2022- 23లో ఈ తరహా లోన్‌లలో 43 శాతం వృద్ధి నమోదైంది. భారత్‌లోనూ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్‌ లోన్‌లలో ఈ కేటగిరీ ముందుంది. 2023 ఫిబ్రవరి నాటికి ఎఫ్‌డీలపై జారీ చేసిన రుణాల మొత్తం రూ.1.13 లక్షల కోట్లకు చేరిందని రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా తెలిపింది.

చాలా మంది డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఆస్తుల్ని తనఖా పెట్టి రుణాలను తీసుకుంటారు. అయితే ఫిక్స్​డ్ డిపాజిట్లను కూడా తనఖాగా పెట్టి లోన్​ పొందవచ్చు. అత్యవసర సమయాల్లో డబ్బు అవసరమైనప్పుడు కచ్చితంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై లోన్‌ను ఒక ఆప్షన్‌గా పరిగణించొచ్చు. వడ్డీరేటు కూడా ఇతర రకాల లోన్లతో పోలిస్తే ఈ లోన్​లో తక్కువగానే ఉంటుంది. అయితే చాలా బ్యాంకులు ఎఫ్‌డీపై రుణాలను ఓవర్‌డ్రాఫ్ట్‌ రూపంలో అందజేస్తాయి. ఎఫ్‌డీపై లోన్​ తీసుకోవడం వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

70- 90 శాతం వరకు లోన్​
ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మొత్తం విలువలో 70-90 శాతం వరకు లోన్​గా పొందొచ్చు. ఉదాహరణకు రూ.10 లక్షల ఎఫ్‌డీ ఉందనుకుందాం. అప్పుడు బ్యాంకు రూ.7 నుంచి రూ.9 లక్షల వరకు రుణాన్ని అందజేస్తుంది. అయితే ఇది బ్యాంకును బట్టి మారే అవకాశం ఉంది.

వడ్డీరేటు తక్కువే!
ఎఫ్‌డీపై రుణం తీసుకుంటే వడ్డీరేటు కూడా తక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు మీ ఎఫ్‌డీపై బ్యాంక్‌ ఆరు శాతం వడ్డీరేటు ఇస్తుందనుకుందాం. అలాంటప్పుడు దీనిపై తీసుకునే రుణానికి వడ్డీరేటు 8-9% మధ్య ఉంటుంది. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ఇది తక్కువే!

కాలపరిమితి వివరాలివే!
ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు వర్తించే కాలపరిమితే.. దానిపై తీసుకునే రుణానికి కూడా వర్తిస్తుంది. కావాలనుకుంటే తక్కువ గడువుతో లోన్​ తీసుకోవచ్చు. కానీ, ఎఫ్‌డీ కాలపరిమితి కంటే మాత్రం రుణ గడువు అధికంగా ఉండొద్దు. ఉదాహరణకు ఐదేళ్ల గుడువుతో ఎఫ్‌డీ తీసుకుంటే.. లోన్​ కాలపరిమితి ఆ కాలాన్ని మించిపోకూడదు.

నో ప్రాసెసింగ్‌ ఫీజు
అయితే ఇతర రుణాల్లోలాగా ఎఫ్‌డీపై తీసుకునే రుణానికి ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజులు ఉండవు. బ్యాంక్​ను బట్టి ఈ నిబంధన మారుతుంది. ఒకవేళ ఏదైనా బ్యాంకు రుసుము వసూలు చేసినా.. అది చాలా తక్కువగానే ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ ఈజీ
ఎఫ్​డీపై రుణ దరఖాస్తు ప్రక్రియ చాలా సులుభంగా ఉంటుంది. పెద్దగా పత్రాలు, ప్రక్రియలు అవసరం లేకుండానే లోన్​ పొందొచ్చు. సంబంధిత ఫారాలపై రుణం తీసుకుంటున్నట్లు సంతకం చేసి కేవైసీ సమర్పిస్తే సరి.

ఎఫ్‌డీని బ్రేక్‌ చేయాల్సిన అవసరం అస్సలు లేదు!
అనేక మంది ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఎఫ్‌డీని బ్రేక్‌ చేస్తుంటారు. దీని వల్ల కొంత వరకు వడ్డీ ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. కానీ, ఎఫ్‌డీపై లోన్​ను తీసుకుంటే దాన్ని బ్రేక్‌ చేయాల్సిన అవసరం ఉండదు. ఇటు మన అవసరం తీరుతుంది. ఎఫ్‌డీ సైతం కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details