LIC Jeevan Utsav Plan Benefits : కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం కోసం చాలా మంది బీమా పథకాలను తీసుకుంటూ ఉంటారు. కానీ వారు కట్టిన సొమ్ము వెనుకకు రాదు. ఇది పాలసీదారులకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించే అంశం. దీనిని దృష్టిలో ఉంచుకునే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 'జీవన్ ఉత్సవ్' పేరుతో ఓ సరికొత్త బీమా పాలసీని తీసుకువచ్చింది.
పొదుపు+ బీమాతో పాటు గ్యారెంటీ రిటర్న్స్‌తో.. ఎల్‌ఐసీ ఈ సరికొత్త జీవన్ ఉత్సవ్ పాలసీని లాంఛ్ చేసింది. ఈ ప్లాన్ నంబర్ - 871. ఈ జీవన్ ఉత్సవ్ అనేది ఒక నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్ పాలసీ. ఒకసారి ఈ ఎల్‌ఐసీ పాలసీ తీసుకుంటే.. ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత, జీవితాంతం ఆదాయం పొందవచ్చు. వాస్తవానికి హామీ మొత్తంలో 10% ఆదాయంగా లభిస్తుంది. అయితే ఇదొక లిమిటెడ్ ప్లాన్ అని గుర్తుంచుకోవాలి.
జీవన్ ఉత్సవ్ పాలసీ - ఫీచర్లు
LIC Jeevan Utsav Plan Features :
- ప్రీమియం టర్మ్, వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఏటా ఆదాయం లభిస్తుంది.
- రెగ్యులర్ ఆదాయం వద్దనుకుంటే ఫ్లెక్సీ విధానం ఎంచుకునే వెసులుబాటు ఉంది. దీని వల్ల చక్రవడ్డీ ప్రయోజనం కలుగుతుంది.
- పాలసీ ప్రారంభమైన ఏడాది నుంచి జీవించి ఉన్నంత వరకు బీమా సదుపాయం ఉంటుంది.
- ప్రీమియం చెల్లించే కాలానికి రూ.1000కు రూ.40 చొప్పున గ్యారెంటీ అడిషన్స్ లభిస్తాయి.
- 90 రోజుల చిన్నారుల నుంచి 65 ఏళ్ల వృద్ధుల వరకు ఎవరైనా ఈ ఎల్‌ఐసీ పాలసీలో చేరవచ్చు.
- ఈ పాలసీ తీసుకున్నవారు.. వివిధ రైడర్లను కూడా ఎంచుకోవచ్చు.
- ఈ పాలసీ తీసుకున్నవారికి రుణ సదుపాయం కూడా కల్పిస్తారు.
జీవన్ ఉత్సవ్ పాలసీకి అర్హులు ఎవరంటే?
LIC Jeevan Utsav Plan Eligibility : ఈ ఎల్‌ఐసీ జీవన్ ఉత్సవ్ పాలసీని మైనర్లు, మేజర్లు, స్త్రీ, పురుషులు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ పాలసీలో కనిష్ఠంగా 90 రోజులు పసివాళ్ల నుంచి గరిష్ఠంగా 65 ఏళ్ల వయస్సు ఉన్నవారు చేరవచ్చు. అయితే పాలసీ చెల్లింపునకు గరిష్ఠ వయసు 75 సంవత్సరాలు. 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల కాల వ్యవధులతో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కనిష్ఠ బీమా మొత్తం రూ.5 లక్షలు. అయితే ఎంచుకున్న కాలవ్యవధిని అనుసరించి వెయిటింగ్ పీరియడ్ ఆధారపడి ఉంటుంది. అంటే.. ఐదేళ్లు ప్రీమియం చెల్లింపు వ్యవధి ఎంచుకుంటే.. 5 సంవత్సరాలు వేచి చూడాల్సి ఉంటుంది. అదే 6 సంవత్సరాలు ఎంచుకుంటే 4 ఏళ్లు; 7 సంవత్సరాలు ఎంచుకుంటే 3 ఏళ్లు; 8-16 సంవత్సరాలు ప్రీమియం చెల్లింపు వ్యవధి ఎంచుకుంటే 2 ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఎల్‌ఐసీ నుంచి బీమా హామీ మొత్తంలో.. ఏటా 10 శాతం చొప్పున జీవితాంతం ఆదాయం పొందవచ్చు. జీవించి ఉన్నంతకాలం ఈ జీవిత బీమా హామీ ఉంటుంది.
సర్వైవల్ బెనిఫిట్స్
LIC Jeevan Utsav Plan Survival Benefits :ప్రీమియం చెల్లింపు, వెయిటింగ్ పీరియడ్ ముగిసిన తర్వాత పాలసీదారుడికి జీవితాంతం ఈ ఎల్‌ఐసీ ప్లాన్ కింద ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో 2 రకాల ఆప్షన్లు ఉంటాయి. ఒకటి రెగ్యులర్ ఆదాయం. రెండోది ఫ్లెక్సీ ఆదాయం. మొదటి ఆప్షన్ ఎంచుకుంటే ప్రతి సంవత్సరం చివర్లో బేసిక్ మొత్తం నుంచి 10 శాతం ఆదాయంగా లభిస్తుంది. అదే ఆప్షన్-2 ఎంచుకుంటే, బీమా మొత్తంలో 10 శాతం ప్రతిఫలం అందుతుంది. ఈ మొత్తం ఎల్‌ఐసీ వద్దనే ఉంచితే 5.5 శాతం చొప్పున చక్రవడ్డీ కలిసి వస్తుంది. ఈ మొత్తాన్ని తీసుకోకుండా ఉంచితే చక్రవడ్డీ ప్రభావంతో పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కావాలంటే జమ అయిన మొత్తం నుంచి 75 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన మొత్తానికి వడ్డీ లభిస్తుంది. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే జమ అయిన మొత్తాన్ని, అలాగే డెత్ బెనిఫిట్స్‌ను నామినీకి చెల్లిస్తారు.
డెత్ బెనిఫిట్స్
LIC Jeevan Utsav Plan Death Benefits :పాలసీదారు దురదృష్టవశాత్తు అకాల మరణం చెందితే.. అతని/ ఆమె వారసులకు బీమా మొత్తం+ గ్యారెంటీడ్ అడిషన్స్‌ను ఎల్‌ఐసీ చెల్లిస్తుంది. వాస్తవానికి డెత్ బెనిఫిట్స్ లేదా వార్షిక ప్రీమియానికి 7 రెట్లు.. ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తుంది. పాలసీ చెల్లింపు కాలవ్యవధికి ప్రతి రూ.1000లకు రూ.40 చొప్పున గ్యారెంటీ అడిషన్స్ కింద చెల్లిస్తామని ఎల్‌ఐసీ హామీ ఇస్తోంది.