Joint Bank Account Benefits : దంపతులు మూడు బ్యాంకు ఖాతాలను కలిగి ఉండాలని ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. సాధారణంగా భార్య లేదా భర్త సంపాదించే సొమ్ము మొత్తం తమ పేరిట ఉన్న వ్యక్తిగత ఖాతాల్లోకే వెళ్తాయి. అయితే ఈ ఖాతాల్లో ఎంత జమచేయాలి అని దానిపై హక్కు మాత్రం ఇండివిజువల్ అకౌంట్ హోల్డర్‌కు మాత్రమే ఉంటుంది. అలా నిర్దేశించుకున్న సదరు మొత్తాన్ని పర్సనల్ అకౌంట్లో ఉంచుకొని మిగతా డబ్బును ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది కలిసి నిర్వహించే జాయింట్ అకౌంట్లకు బదిలీ చేస్తుంటారు.
జాయింట్ అకౌంట్ అంటే ఏంటి..?
జాయింట్ అకౌంట్ అనేది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి భాగస్వామ్యంతో నిర్వహించే ఒక బ్యాంక్ ఖాతా. సాధారణంగా చాలా బ్యాంకులు గరిష్ఠంగా నలుగురిని మాత్రమే ఈ తరహా అకౌంట్స్‌ను తెరిచేందుకు అనుమతిస్తున్నాయి. అయితే ఈ జాయింట్ ఖాతా ద్వారా అనేక ప్రయోజనాలను ప్రతి ఖాతాదారుడు పొందవచ్చు. ఈ ఖాతా సాయంతో డెబిట్ కార్డులు లేదా ఆన్లైన్ ద్వారా కూడా ఇందులోని డబ్బును ఖాతాదాలులు సులభంగా వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఇది బిల్లు చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేస్తుంది. అలాగే ఖర్చులను ట్రాక్ చేసే ఒక సాధనంలా కూడా ఈ జాయింట్ అకౌంట్ పనిచేస్తుంది.
జాయింట్ అకౌంట్‌తో..
అద్దె ఖర్చులు, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, కిరాణా సామగ్రి కొనుగోలుతో పాటు వినోదం కోసం అయ్యే వ్యయం లాంటి ఉమ్మడి ఖర్చులను జాయింట్ ఖాతా ద్వారా నెరవేర్చుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో డబ్బులను మిగతావారితో కలిసి ఉమ్మడిగా ఆదా చేసుకోవచ్చు. తద్వారా భవిష్యత్‌లో ఎదురయ్యే ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
అందరికీ సమాన హక్కులు ఉంటాయి..
సాధారణంగా పర్సనల్ అకౌంట్స్ ఉన్నవారు ప్రతిసారి వారు చేసే ఖర్చులు, పొదుపుల కోసం ఇతరుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు. అదే జాయింట్ అకౌంట్లో అయితే కచ్చితంగా అవతలి వ్యక్తి లేదా ఖాతాదారుడిని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదైనా లావాదేవీ చేసేటప్పుడు అతడిని సంప్రదించాలి. ఈ రకం ఖాతాల్లో డిపాజిట్లు కానీ విత్‌డ్రాలు గానీ చేస్తే జాయింట్ అకౌంట్లో భాగస్వామిగా ఉన్న వేరే వ్యక్తికి సమాచారం ఇవ్వాలి. అయితే ఇలాంటివి చేసేటప్పుడు ఒకరినొకరు విశ్వసించుకోవడం అనేది చాలా ముఖ్యం. కాగా, ఇందులో ప్రతి ఖాతాదారుడికి సమాన హక్కులు ఉంటాయి. అవసరమైతే ఖాతాను కూడా క్లోజ్ చేయవచ్చు.
ఎవరితోనైనా తెరవచ్చు..
జాయింట్ అకౌంట్‌ను కేవలం భార్య లేదా భర్తతో మాత్రమే కాదు.. తల్లి, తండ్రి, తోబుట్టువులు, పిల్లలు, బిజినెస్ పార్టనర్ ఇలా ఎవరితోనైనా కలిసి తెరవచ్చు.
లాభాలు..
- జాయింట్ అకౌంట్.. దంపతుల్లో ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిస్తోంది. ఇద్దరి మధ్య ఉండే నమ్మకం పరస్పరంగా బలపడుతుంది.
- ఈ ఖాతా.. భార్యాభర్తలు ఇద్దరికి సమానంగా ఉండే ఆర్థిక లక్ష్యాలను సులువుగా నెరవేరుస్తుంది.
- లోన్స్, EMIలను సకాలంలో చెల్లించేందుకు జాయింట్ అకౌంట్ ఉపయోగపడుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
- జాయింట్ బ్యాంక్ అకౌంట్ పద్ధతిలో ప్రతి వ్యక్తికి ఖాతాలో డబ్బును డిపాజిట్ చేసే హక్కు ఉంటుంది. అంతేకాకుండా డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఇలా ఆ ఖాతాను మెయింటేన్ చేయవచ్చు.
- ఈ జాయింట్ ఖాతాపై ఒక్క వ్యక్తి మాత్రమే ఎక్కువ నియంత్రణను కలిగి ఉన్నప్పటికీ.. ఇందులో డబ్బు జమ చేసిన తర్వాత అందరికీ సమాన హక్కులు లభిస్తాయి.
- జాయింట్ ఖాతాలోని ఇతర ఖాతాదారుడిపై పూర్తి విశ్వాసం ఉంచాలి. ఎలాగంటే మీకు కష్టపడి సంపాదించిన సొమ్మును జాయింట్ ఖాతాలో జమ చేసినప్పుడు దానిని వేరే అకౌంట్ హోల్డర్ సమర్థవంతంగా నిర్వహించగలడు అనే నమ్మకాన్ని మనం అతడిపై ఉంచాలి.
- ఒకవేళ ఒక్క ఖాతాదారుడు అకౌంట్‌ను మూసేయాలి అనుకుంటే మూసేయవచ్చు.
- జాయింట్ ఖాతాను నిర్వహించే విధానానికి సంబంధించిన నిర్ణయాన్ని ఖాతాదారులే ఎంచుకోవచ్చు.
- ఎన్ఆర్ఐలు కూడా ఇండియన్ సిటిజెన్‌తో కలిసి జాయింట్ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు.
- అయితే జాయింట్ అకౌంట్‌లలో కొంత రిస్క్ కూడా ఉంటుంది. ఒక్కోసారి మీ భాగస్వాములలో ఒకరు రుణాన్ని కట్టకుండా ఎగవేస్తే దానికి సంబంధించిన పరిణామాలను మీరూ ఎదుర్కోవాల్సి వస్తుంది.
- ఐటీఆర్ ఫైలింగ్‌లు లాంటి కొన్ని వ్యక్తిగత అంశాలకు ఈ జాయింట్ అకౌంట్ భంగం కలిగించవచ్చు.