ప్రపంచ ఆర్థికవ్యవస్థకు అమెరికా ఫెడరల్ రిజర్వ్, రష్యా, చైనాల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జోసెఫ్ స్టిగ్లిట్జ్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించే పేరుతో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం వల్ల నిరుద్యోగ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. భారతదేశంలో ఆర్థికాభివృద్ధికి అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లడం ముఖ్యమని, 21వ శతాబ్దపు ఆర్థికాభివృద్ధిలో ఆవిష్కరణలది కీలకస్థానమని, వాటికి మూలస్థానాలైన విశ్వవిద్యాలయాలపై దాడి మంచిది కాదని హితవు పలికారు. మరో ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముట్టనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివి..
ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమేంటి? ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లేంటి? కొవిడ్, ఉక్రెయిన్‌పై రష్యా దాడి పరిణామాల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకొనే అవకాశం ఉందంటారా?
ద్రవ్యోల్బణం సమస్య చాలా తీవ్రంగా ఉంది. నాలుగు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంతగా గత కొన్నేళ్లలో ప్రపంచం తీవ్రస్థాయిలో ద్రవోల్బణాన్ని ఎదుర్కొంది. కొవిడ్ వ్యాప్తి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి దీనికి ప్రధాన కారణాలు. మార్కెట్‌పై కొందరి గుత్తాధిపత్యం కూడా ఓ కారణం. సరఫరాలో అంతరాలు, కొనుగోలు తగ్గిపోవడం వంటి వాటికి కొవిడ్ కారణమైతే.. ఇంధనం, ఆహారధాన్యాల కొరత వంటివి ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల ఉత్పన్నమయ్యాయి. ఇంధన సరఫరాలో అంతరాయం వల్ల కార్లకు ఎక్కువగా ఇబ్బంది కలిగింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి పలు చర్యలు తీసుకోవాల్సి ఉంది. గత అయిదు దశాబ్దాలుగా అమెరికా, యూరప్‌లు ఆహారధాన్యాలు ఉత్పత్తి చేయకుండా ఉండటానికి రైతులకు సొమ్ము చెల్లించాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ఈ విధానానికి స్వస్తి పలకాల్సి ఉంటుంది. దానివల్ల ఆహారధాన్యాల ధరలు తగ్గుతాయి. ఇంధనం ధరలు వచ్చే వారం నుంచి తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ దీని నుంచి బయటపడి సంప్రదాయేతర ఇంధనరంగం వైపు మళ్లాల్సి ఉంది. చమురుపై సౌదీ అరేబియా, రష్యాల ఆధిపత్యం తగ్గించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో కార్లు నడిచేలా చూడాలి.
వడ్డీ రేట్లు పెంచడం వల్ల ద్రవ్యోల్బణాన్ని కొంతవరకు మాత్రమే అదుపు చేయగలం. అయితే ప్రపంచ స్థితిగతులను కొవిడ్ అధ్వానంగా మార్చింది. తగినంత సరఫరాలు లేకపోవడం ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వ్యక్తిగత వినిమయం తక్కువగా ఉంది. కాబట్టి అమెరికా లాంటి చోట కొవిడ్ సమయంలో చేసిన ఆర్థికసాయం వల్ల వినియోగం ఎక్కువగా ఉందన్నది కూడా పూర్తి వాస్తవం కాదు. కానీ ద్రవ్య విధానాన్ని బిగించడం మరిన్ని కష్టాలకు దారితీసింది. దీనివల్ల సంస్థలకు పెట్టుబడులకు ఇబ్బంది కలిగి సరఫరాలో తగ్గుదల ఏర్పడింది. మధ్యతరగతి, పేద వర్గాలపై ద్రవ్యోల్బణం ప్రభావం తగ్గేలా విధానాలుండాలి. దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉండాలి.
అమెరికా, యూరప్, భారత్ ఇలా అనేక ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచమని ఒత్తిడి చేస్తున్నాయి. పెరుగుతున్న ధరలను అదుపు చేయడానికి అదే ఏకైక మార్గమని భావిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెంచడంపై ఎక్కువ ఆధారపడటం వల్ల స్వల్ప, మధ్య ఆదాయ దేశాల్లో ఆర్థిక సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉందా?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ గురించి ప్రధానంగా అర్థం చేసుకోవాల్సి ఉంది. వీళ్లు వడ్డీ రేట్లు పెంచితే ఇతర దేశాలు కూడా బలవంతంగా పెంచాల్సి వస్తుంది. దీనికి తగ్గట్లుగా పేద దేశాలు వడ్డీ రేట్లను ఎలా పెంచగలవు? ఆ దేశాల ఆర్థికవ్యవస్థలు బలహీనంగా ఉంటాయి. యూరప్ ఇప్పటికే దీన్ని అనుభవిస్తోంది. వడ్డీ రేట్లు పెంచడం వల్ల అంతర్జాతీయంగా చాలా ప్రభావం ఉంటుంది. ఆర్థికవృద్ధి మరింత నెమ్మదిస్తుంది. మార్కెట్ విధానంలో మార్పులు తేవడం, వస్తూత్పాదనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, సంప్రదాయేతర ఇంధన వనరులపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి పనిచేయడం వల్ల చమురు దిగుమతులను తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఇంధన ధరలు త్వరగా తగ్గుతాయి. మార్కెట్ శక్తుల చేతిలో కేంద్రీకృతమై ఉన్న అధికారాన్ని కూడా తగ్గించాలి. కానీ ప్రస్తుత ద్రవ్య విధానం చాలా గుడ్డిగా ఉంది. ఇది నిరుద్యోగ సమస్య భారీగా పెరగడానికి కారణమవుతుంది. దీని పర్యవసానాలు మరింత తీవ్రంగా ఉంటాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా పెంచడం వల్ల కరెన్సీ విలువ పెరుగుతుంది. దీనివల్ల దిగుమతుల ధరలు, ద్రవ్బోల్బణం అమెరికాలో కొంత తగ్గవచ్చు. కానీ ఇతర దేశాల్లో ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతాయి. మారక విలువలో కూడా మార్పు వస్తుంది.
సరళీకృత విధానాలు చివరి దశకు చేరుకున్నాయా? ప్రస్తుతం ఇవి ఎలా రూపాంతరం చెందుతాయి? సరళీకరణ విధానాలతో వచ్చిన సంక్షోభం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రాజకీయ సంక్షోభంగా మారే అవకాశం ఉందా?
సరళీకృత విధానాలు చివరిదశకు చేరుకొన్నట్లే. ఈ కాలంలో వృద్ధి నెమ్మదిగా ఉండటం, విశ్వసనీయత ఇలా అనేక అంశాలున్నాయి. ప్రపంచంలో అనేక సంక్షోభాలకు మార్కెట్ ఫెడరలిజం కారణం. కానీ ఇదొక సిద్ధాంతం. రాజకీయాలను ఎప్పుడూ థియరీ నడపలేదు.
2008 నాటి ఆర్థికమాంద్యం తర్వాత ప్రస్తుతం కొవిడ్, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం తీవ్రంగా పెరిగాయి. ఉపాధి అవకాశాలు, కచ్చితమైన ఆదాయం ఎక్కువమంది ప్రజలకు తగ్గుతున్న నేపథ్యంలో వీటికి పరిష్కారమేంటి?
దీనికి మ్యాజిక్ ఏమీ లేదు. ప్రధానంగా సమ్మిళిత అభివృద్ధి సాధించడమే పరిష్కారం. ఆధునిక శాస్త్రాన్ని, సాంకేతికతను, ఆర్థికశాస్త్రాన్ని వినియోగించుకొని అభివృద్ధి సాధించడం. ప్రపంచంలో సమాన మార్కెట్ అవకాశాలు, సంపద దక్కేలా చూడటం. భారతదేశంలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ప్రపంచంలో హెచ్చుస్థాయిలో అసమానతలున్నాయనేది కాదనలేని వాస్తవం. సమాజంలో అసమానతలు తగ్గించే విధానాలతోపాటు సామాజికంగా, రాజకీయంగా అస్థిరత్వం ఉండకూడదు.
మీ దృష్టిలో భారత ఆర్థికవ్యవస్థలో తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రంగం ఏది? శ్రీలంక అనుభవాల నుంచి మూడో ప్రపంచ దేశాలు.. ప్రత్యేకించి భారత్ ఏం పరిగణనలోకి తీసుకోవాలి?
21వ శతాబ్దంలో ఆర్థికాభివృద్ధి సాధించాలంటే రెండు అంశాలు కీలకం. ఇందులో మొదటివి ఆవిష్కరణలు. వీటి కోసం మంచి ఆలోచనలు కావాలి. అందుకు మంచి విశ్వవిద్యాలయాలు కావాలి. అందువల్ల విశ్వవిద్యాలయాల పైన దాడి మంచిది కాదు. అందరినీ కలుపుకొని వెళ్లడం (ఇంక్లూజివ్‌నెస్) ఆర్థికాభివృద్ధికి ముఖ్యం. కొన్ని వర్గాలను దూరం పెట్టినట్లుగా ఉండటం మంచిది కాదు. ఇలాగే కొనసాగితే ఆ ప్రభావం ఆర్థికాభివృద్ధిపై పడే అవకాశం ఉంది. తెలుసుకోవాల్సిన ప్రధాన అనుభవం ఇదే. తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రంగం అంటే నా అభిప్రాయం ప్రకారం.. భారత్‌కు ప్రధాన సమస్య అంతర్జాతీయంగా ఎదురవుతున్నది కాదు.. రాజకీయ కారణాల వల్ల. 21వ శతాబ్దంలో ఆలోచనలది కీలక స్థానం. కానీ మీడియా, విశ్వవిద్యాలయాలు ఇలా అన్నింటినీ తక్కువ చేసి చూడటం, వాటి ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయకూడదు. మీడియా ఆధిపత్యం కేంద్రీకృతమవుతోంది. యూనివర్సిటీ వ్యవస్థ చాలా ప్రభావానికి గురవుతుంది. భారత భవిష్యత్తుపైన ఇది ఎక్కువగా ప్రభావం చూపనుంది. ఆర్థికవృద్ధిలో అన్ని వర్గాల భాగస్వామ్యం ఉండటం, సమ్మిళిత అభివృద్ధి, మంచి ఆవిష్కరణలు రావాల్సిన సమయంలో విశ్వవిద్యాలయాలపైన దాడి మంచిది కాదు.