INSURANCE AT HOME IRDAI: కొవిడ్ పరిణామాల నేపథ్యంలో జీవిత, ఆరోగ్య బీమా ప్రాధాన్యం బాగా పెరిగింది. అయినప్పటికీ.. దేశంలో బీమా విస్తరణ ఇంకా ఆశించిన స్థాయిలో లేదు. దీనిపై దృష్టి సారించిన భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ).. ఇంటి వద్దకే బీమా సేవలు అందించేలా బీమా మిత్ర వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.
IRDAI Insurance regulations:దేశంలో జీవిత బీమా విస్తృతి 3.2 శాతమే ఉంది. ప్రధాన పట్టణాల్లో కాస్త అధికంగా ఉన్నప్పటికీ.. మూడో అంచె పట్టణాలు.. గ్రామీణ ప్రాంతాల్లో బీమా పాలసీలు ఇంకా అనుకున్న స్థాయిలో అందుబాటులో ఉండటం లేదు. బీమా సంస్థలు కూడా గ్రామీణ ప్రాంతాలపై సరైన దృష్టి సారించడం లేదు. ఆ ప్రాంతాల్లో వ్యాపారం కన్నా.. ఖర్చు అధికంగా ఉంటోందని బీమా సంస్థలు భావించడమే ఇందుకు కారణం. గ్రామీణ భారతానికి బీమా చేరువయ్యేందుకు బీమా మిత్ర దోహద పడుతుందని నియంత్రణ సంస్థ భావిస్తోంది.
ఇలా పనిచేస్తుంది...:గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు సేవలు అందించేందుకు ప్రభుత్వం బ్యాంకు మిత్రలను ఏర్పాటు చేసింది. వీరందరూ మహిళలే. గ్రామాల్లోని స్వయం సహాయక బృందాలతో కలిసి పనిచేస్తుంటారు. ఒక నిర్ణీత బ్యాంకు శాఖకు అనుబంధంగా ఉంటూ.. తమ సేవలను అందిస్తుంటారు. స్వయం సహాయక బృందాలకు పొదుపు ఖాతా ప్రారంభించడం, రుణాలకు సహకరించడం, అందరికీ ఆర్థిక సేవలు అందేలా చూడటం వీరి విధి. ఇదే తరహాలో బీమా మిత్రలను ఏర్పాటు చేసేందుకు ఐఆర్‌డీఏఐ సిద్ధం అవుతోంది. దీనివల్ల గ్రామీణ ప్రజలను, బీమా సంస్థలతో అనుసంధానం చేసేందుకు వీలవుతుంది. సంస్థలు ప్రత్యేక పాలసీలను రూపొందించడం ద్వారా బీమా విస్తరించేందుకు వీలు కలుగుతుందని ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ దేబాశిష్ పాండే ఇటీవల బీమా సంస్థల సీఈఓల సమావేశంలో పేర్కొన్నారు. త్వరలోనే ఈ విషయంలో మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉంది.