How UPI Payment Works in Telugu : ఒకప్పుడు ఎవరికైనా డబ్బులను పంపించాలంటే బ్యాంకుకు వెళ్లి.. అక్కడ ఫారాలు నింపి, క్యూలో గంటల తరబడి సమయం వృథా చేసుకోవాల్సి వచ్చేది. ఎప్పుడైతే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందో ఆ పని చాలా ఈజీ అయింది. అది ఎలాగో మనందరికీ తెలుసు. అదేనండీ ఫోన్‌పే, గూగుల్ పే యూపీఐ యాప్స్. వీటి ద్వారా దేశంలో ఎక్కడున్న వారికైనా వెంటనే ఎన్ని డబ్బులనైనా పంపించవచ్చు. మనందరికి నిత్యం ఆర్థిక లావాదేవీల్లో ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ యూపీఐ యాప్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసలేంటి ఈ యూపీఐ ?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియంత్రిస్తుంది. యూపీఐ ప్రతి యూజర్‌కు ఒక ప్రత్యేకమైనయూపీఐ ఐడీని క్రియెట్ చేస్తుంది. దీని ద్వారా యూజర్ ఇతరులకు చెల్లింపులు చేయడం, స్వీకరించడం జరుగుతుంది.
యూపీఐ ఎందుకు విజయవంతమైంది ?
యూపీఐ యాప్‌లో చెల్లింపులను చేయడం పూర్తిగా ఉచితం. మీరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఎటువంటి రుసుము చెల్లించకుండా ఎవరికైనా, ఎప్పుడైనా, ఎంత డబ్బునైనా బదిలీ చేయవచ్చు. ఈ యాప్‌లో ఆటోపే ఆప్షన్ కూడా ఉంది. దీని వల్ల మీరు మీ బిల్లులను, సబ్‌స్క్రిప్షన్‌లను ఆటోమెటిక్‌గా చెల్లించవచ్చు. దీంతో మీ సమయం ఆదా అవుతుంది.
యూపీఐ ఎలా పని చేస్తుంది ?
యూపీఐ యాప్‌లో మీరు డిజిటల్ చెల్లింపులను చేయడానికి యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. తరవాత మీరు దానికి బ్యాంకు ఖాతాను జోడించాలి. యాప్‌లు పేమెంట్ చేయడానికి పుష్, పుల్ మెకానిజం ఉపయోగిస్తాయి. మీరు డబ్బును పంపించాలనుకుంటున్న వ్యక్తి మొబైల్ నెంబర్‌ను లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, యూపీఐ పిన్‌ను ఎంటర్ చేసి నగదును పంపించవచ్చు. ఈ యాప్స్‌లో డబ్బును స్వీకరించడానికి కలెక్ట్ లేదా రిక్వెస్ట్ మనీ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీని కోసం వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA) సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. నగదును చెల్లించడానికి ఎప్పటినుంచో అందుబాటులో ఉన్న నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS), ఇమ్మీడియట్ మొబైల్ పేమెంట్ సర్వీస్ (IMPS)లలాగే యూపీఐ చెల్లింపుల విధానం పూర్తిగా సురక్షితమైంది. యూపీఐ చెల్లింపుల విధానంలో మీ డేటాను ఎవరూ చోరీ చేయలేరు.
వివిధ యూపీఐ యాప్‌లు ఒక్కో కొత్త యూపీఐ ఐడీని సెటప్ చేస్తాయి..మీరు ఉపయోగించే ఫోన్‌పే, గూగుల్ పేలో వేర్వేరుగా యూపీఐ ఐడీలు ఉంటాయి. ఇది మీరు గమనించారా ? ఈ విధంగా ఎందుకు ఉంటాయంటే.. మీరు వివిధ బ్యాంకులతో యాప్‌నకు లింక్ అవ్వడమే కారణం. ఉదాహరణకు Google Payలో ఉండే సాధారణ UPI IDలు @oksbi, @okhdfcbank, @okaxis, @okicici.
UPI Vs UPI Lite : బేసిక్ ఫోన్‌తో పేమెంట్స్ చేయాలా?.. UPI & యూపీఐ లైట్ వాడండిలా!