Financial Crimes : ప్రస్తుత కాలంలో బ్యాంకు ఖాతాలు అకౌంట్లు, ఇతర ఆర్థిక కార్యకలాపాలు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఖాతాల నిర్వహణ, నగదు చెల్లింపులు లాంటివి బ్యాంకుకు వెళ్లకుండానే అన్ని వ్యవహారాలు ఆన్‌లైన్‌లోనే అయిపోతున్నాయి. ఈ కార్యకలాపాలన్నీ ఎంత సులువుగా జరుగుతున్నాయో.. అంతే వేగంగా ఆన్‌లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఖాతాదారుడి ఐడెంటిటీ కూడా అంతే వేగంగా చోరీకి గురవుతోంది! భారత్‌లో అనేక లక్షల మంది ఐడెంటిటీ చోరీకి గురయ్యింది. ఇదే ఐడెంటిటీతో వారికి తెలియకుండానే రుణాలు తీసుకుని.. ఎగవేసి మోసం చేసేవారు ఎందరో ఉన్నారు. దీని నుంచి ఎలా కాపాడుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఆధార్, పాన్, ఈ-మెయిల్ ఉంటున్నాయి. బ్యాంకు అకౌంట్ తెరవాలన్నా, ఏదైనా రుణం తీసుకోవాలన్నా ఈ వివరాలు తప్పనిసరి. అంటే ఇవన్నీ మీ ఐడెంటిటీలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. వీటిని మనం చాలా చోట్ల ఏదో ఒక ప్రత్యేక కారణాలతో ఇస్తుంటాం. ఫోన్, కంప్యూటర్, ఈ-మెయిల్‌లో భద్రపరుచుకుంటాం. వీటి ద్వారా ఎక్కడైనా మీ ఐడెంటిటీ చోరీకి గురయ్యే అవకాశం ఉంది. దీంతో ఆర్థిక నేరగాళ్లు మీ పేరు మీద రుణం తీసుకుని ఎగవేయొచ్చు. ఆర్థిక, సైబర్ నేరగాళ్లు.. ఇతరుల ఐడెంటిటీతో ఫిన్‌టెక్ రుణ సంస్థల నుంచి ఆన్‌లైన్‌లో లోన్లు తీసుకొని ఎగవేస్తున్నారని చాలా ఆరోపణలు వస్తున్నాయి. మీ ఆర్థిక గుర్తింపు చాలా ముఖ్యమైనది. ఇది ఏ పరిస్థితిలో ఉన్నా రక్షించుకోవడం చాలా కీలకం. మోసాలు సర్వసాధారణమైన ఈ రోజుల్లో మీ సమాచారం సురక్షితంగా ఉందని నిర్ధరించుకోవడం చాలా ముఖ్యం. సమాచార భద్రత మీద అస్సులు రాజీ పడకూడదనే విషయం గుర్తుంచుకోవాలి.
ఐడెంటిటీ చోరీ
Identity Theft Fraud : ఐడెంటిటీ చోరీలో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సంగ్రహిస్తాడు. ఈ ఐడెంటిటీ ఏదైనా.. పేరు, పుట్టిన తేదీ, బ్యాంకు అకౌంట్, డెబిట్, క్రెడిట్ కార్డు నంబర్లు మొదలైన ఐడీలతో చట్టవిరుద్ధమైన లేదా మోసపూరిత కార్యకలాపాలను నిర్వహించడం కోసం చోరీ చేస్తారు. ఉదాహరణకు ఏవైనా వస్తువులను కొనడం కోసం మీ క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను చోరీ చేయవచ్చు. లోన్లు పొందేందుకు మీకు తెలియకుండానే మీ పాన్ కార్డు నంబరును వాడవచ్చు. ఓటీపీ యాక్సెస్ పొందడానికి మీ ఫోన్ నంబరు అక్రమ పద్ధతుల ద్వారా వాడుకునే అవకాశం కూడా ఉంది.
అలర్ట్
మీ క్రెడిట్ స్కోరును చూసి మీ పాన్ నంబరును ఉపయోగించి వేరేవారేవరైనా మీ పేరు మీద లోన్ తీసుకున్నారా లేదా అని మీరు తనిఖీ చేయొచ్చు. Cibil, Experian, Equifax వంటి క్రెడిట్ బ్యూరోలు మీ పేరు మీద ఉన్న రుణాల సమాచారాన్ని అందిస్తాయి. క్రెడిట్ బ్యూరో రిపోర్ట్‌లో గత 30, 60, 90 రోజుల్లో మీరు లోన్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నారో తెలిపే ప్రత్యేక డేటా పాయింట్ ఉంటుంది. మీరు ఈ సమయంలో రుణం కోసం దరఖాస్తు చేయనప్పుడు లోన్ యాక్టివిటీని డేటా పాయింట్‌లో గమనించినట్లయితే.. అది మీ పాన్ దుర్వినియోగం అవుతుందనడానికి సంకేతంగా చెప్పవచ్చు.
మీ ఐడెంటిటీ దుర్వినియోగం అయినప్పుడు/ ఆర్థికంగా నష్టపోయినప్పుడు, వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తారు. అంతేకాకుండా.. మీ క్రెడిట్ నివేదికలో మోసం జరిగినట్టు గ్రహిస్తే, 'ఫ్రాడ్ వార్నింగ్'ను సూచించాలి. దేశంలోని ప్రధాన క్రెడిట్ బ్యూరోలైన Cibil, Experian, Equifaxలను సంప్రదించడం ద్వారా దీన్ని చేయవచ్చు. మీ పేరుతో ఏవిధమైన కొత్త ఖాతాను తెరవడానికైనా ముందు మీ ఐడెంటిటీని ధ్రువీకరించడానికి అదనపు చర్యలు తీసుకోవాలని బ్యాంకులను అలర్ట్ చేస్తాయి.
క్రెడిట్ ఫ్రీజ్..
Credit Freeze Bank Account : సాధారణంగా రుణ గ్రహీతలు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు, రుణసంస్థలు క్రెడిట్ బ్యూరోలలో రిపోర్ట్ తీసుకుంటారు. 'క్రెడిట్ ఫ్రీజ్'.. మీ అనుమతి లేకుండా క్రెడిట్ నివేదికను యాక్సెస్ చేయనీయదు. ఇది మీ పేరు మీద కొత్త ఖాతాలను తెరవకుండా ఆర్థిక నేరస్థులను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ ఐడెంటిటీ చోరీకి గురైతే మీ బ్యాంకుకు వెంటనే తెలియజేయండి. మోసపూరిత ఖాతాలను బ్యాంకులు రద్దు చేస్తాయి.
క్రెడిట్ నివేదికల పర్యవేక్షణ
దేశంలో ఉన్న ప్రధాన క్రెడిట్ బ్యూరోల నుంచి కనీసం సంవత్సరానికి ఒకసారి మీ క్రెడిట్ నివేదికను తీసుకోండి. ఏదైనా అనధికార ఖాతాలు, ఛార్జీలు ఉంటే ఈ నివేదికలో తెలుస్తాయి. మీకు సంబంధం లేని ఖాతాలు, ఛార్జీలను కనుగొంటే, వాటి గురించి క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేయండి. ఈ సమస్యను వారు పరిష్కరిస్తారు. ఇంకా మోసపూరిత ఖాతాలను, ఛార్జీలను తొలగిస్తారు. మీ క్రెడిట్ నివేదికలను పర్యవేక్షించకపోతే మీ సమాచారాన్ని ఉపయోగించుకుని ఆర్థిక నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉంది.
ఆన్‌లైన్‌లో జాగ్రత్తలు..
మీరు ఆన్‌లైన్‌లో ఏ సమాచారాన్ని షేర్ చేస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించండి. మీకు తెలియని, విశ్వసించని వారితో మీ పాన్ కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతా, క్రెడిట్/డెబిట్ ఖాతా నంబర్లు షేర్ చేయవద్దు. మీ బ్యాంకు ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోండి. బ్యాంకు సూచనలను తప్పకుండా పాటించండి. పాస్‌వర్డ్ రూపొందించేటప్పుడు అక్షరాలు, సంఖ్యలు, చిహ్నాల కలయిక ఉండాలి. మీ లాగిన్ సమాచారం, కార్డు సీవీవీ నంబరు, ఓటీపీలను (ఏ సందర్భంలోనూ) బహిర్గతం చేయాలని గానీ, ఫోన్‌లో తెలపాలని గానీ ఏ బ్యాంకు/ ఆర్థిక సంస్థ మిమ్మల్ని అడగదన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి.
సాఫ్ట్‌వేర్ ప్రొటెక్షన్
Malware Protection : బ్యాంకు ఖాతాలు, అనేక ఇతర ఆర్థిక కార్యకలాపాలు.. ఇలా ప్రతిదీ ఆన్‌లైన్ అయిన సందర్భంలో కంప్యూటర్‌ల మీద ఆధారపడుతుంటాం. మనం ఉపయోగించే ప్రతి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లకు 'మాల్వేర్' నుంచి రక్షించడంలో సహాయపడే భద్రతా ఫీచర్‌లను కలిగి ఉండాలి. ఐడెంటిటీ చోరీ నిరోధించడానికి ముందు జాగ్రత్తగా మీ కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌లు వైరస్‌లకు గురవ్వకుండా సిస్టమ్‌ను రక్షించే సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.
జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
క్రెడిట్ కార్డు సంస్థలు, ఇతర రుణ సంస్థలు నెలవారీ స్టేట్‌మెంట్‌లను పంపినప్పుడు స్టేట్మెంట్లోని ఎంట్రీలను చెక్ చేసుకోండి. మీకు సంబంధం లేని లావాదేవీలను గుర్తించినట్లయితే వెంటనే క్రెడిట్ కార్డు హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి వారికి తెలియజేయండి. మీరు ఈమెయిల్‌ను ఓపెన్ చేసినప్పుడు అప్రమత్తంగా ఉండడం మర్చిపోవద్దు. తెలియని వారి నుంచి వచ్చే ఈ-మెయిల్‌ను ఓపెన్ చేయొద్దు. అలాంటి మెయిల్స్‌లోని లింక్‌లపై క్లిక్ చేయకూడదు.
మీ ఫోన్ గ్యాలరీలో పాన్, ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డుల ఇమేజ్‌లను భద్రపరచవద్దు. ఫోన్ హ్యాక్ లేదా చోరీకి గురయినప్పుడు మీ గుర్తింపు ఇమేజ్‌లు కూడా చోరీ అయ్యి, దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. RFID (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) సిగ్నల్‌లను నిరోధించే అనేక వాలెట్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మీరు వీటిని ఉపయోగించడం వల్ల నేరగాళ్లు మీ డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను స్కాన్ చేయలేరు. అనేక వెబ్‌సైట్‌లు SSL (సెక్యూర్ సాకెట్స్ లేయర్) సర్టిఫికెట్‌ను కలిగి ఉన్నాయి. వెబ్‌సైట్ సురక్షితంగా ఉందో లేదో దాని ULRను చూడడం ద్వారా చెక్ చేయవచ్చు. ఇది https://తో ప్రారంభమైతే, అది SSL లేదా ఇతర ఎన్‌క్రిప్షన్ సర్టిఫికేట్‌లతో సురక్షితంగా ఉందని అర్థం చేసుకోవాలి.