How To Increase Car Mileage : చాలామంది కారు డ్రైవర్లు తమ వాహనం ఎక్కువ మైలేజ్ ఇవ్వాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఈ కాలంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో అధిక మైలేజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. అయితే కారు ఉండి, అది తక్కువ మైలేజ్ ఇస్తోందని బాధపడుతున్నారా? ఈ సింపుల్ టిప్స్‌తో మీ కారు మైలేజ్ సామర్థ్యాన్ని సులువుగా పెంచుకోండి. (How To Get Mileage For Cars).
స్థిరమైన వేగం పాటించండి
చాలా మంది కారును స్టార్ట్ చేసిన తర్వాత వేగంగా వెళుతుంటారు. రహదారులపై అయితే చెప్పనక్కర్లేదు. ఇలా చేయడం వల్ల అధికంగా ఇంధన వినియోగం అవుతుంది. ఒక స్థిరమైన వేగాన్ని పాటించడం వల్ల ఇంధనం ఆదా అవుతుంది. స్మూత్ డ్రైవింగ్ ఇంధన వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. తద్వారా మీ కారు మైలేజీ పెరుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా, ముఖ్యంగా హైవేలపై క్రూయిజ్ కంట్రోల్‌ను ఉపయోగించండి.
వస్తువు బరువు తగ్గించండి
కారులో అధికంగా వస్తువులు ఉండటం వల్ల కూడా ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. అందుకని అనవసరమైన వస్తువుల్ని వాహనంలో నుంచి తీసేయండి. అవసరం లేనప్పుడు విండోస్, రూఫ్ రాక్లను మూసి ఉంచండి. ఇలా చేయడం వల్ల ఏరోడైనమిక్ డ్రాగ్ తగ్గుతుంది. ఫలితంగా ఇంధన వినియోగం తగ్గి కారు మైలేజ్ పెరుగుతుంది.
టైర్లలో తగినంత గాలి
తక్కువ గాలి ఉన్న టైర్లు రోలింగ్ నిరోధకత, ఇంధన వినియోగాన్ని పెంచుతాయి. అందుకని మీ కారు టైర్లలో గాలిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. అది కంపెనీ సిఫారసు చేసిన స్థాయిలో ఉండేటట్లు చూసుకోండి.
అనవసర సమయాల్లో ఇంజిన్ ఆఫ్
కొన్నిసార్లు మనకు పెద్దగా అవసరం లేకున్నా ఇంజిన్‌ను ఆన్‌లోనే పెట్టి ఉంచుతాం. దీని వల్ల అధిక ఇంధన వినియోగం అవ్వడమే కాకుండా అనవసరమైన ఉద్గారాలు వాహనం నుంచి వెలువడుతాయి. అందుకే మీరు కారు పార్క్ చేసినప్పుడు లేదా ఏదైనా పని మీద కాసేపు ఆపినప్పుడు ఇంజిన్‌ను ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ప్రయాణాల్ని ప్లాన్ చేసుకోండి
మీరు వెళ్లాలనుకునే ప్రయాణాల్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల ఇంధనంను ఆదా చేసుకోవచ్చు. ఒకే ట్రిప్పులో రెండు మూడు పనులు ఉండేలా చూసుకోండి. సులభంగా, సమీప మార్గంలో వెళ్లేందుకు నావిగేషన్ అప్లికేషన్లను వినియోగించండి. దీని వల్ల ట్రాఫిక్ సమస్యలను కూడా అధిగమించవచ్చు.