బీమా అంటే పాలసీదారుడు, బీమా సంస్థ మధ్య కుదిరే నమ్మకమైన ఒప్పందం. ఇందులో ఏ చిన్న పొరపాటు ఉన్నా.. బీమా సంస్థ చికిత్స ఖర్చును చెల్లించేందుకు నిరాకరిస్తుంది. ఇందులో కొన్ని అంశాలను గమనిస్తే..
సమాచారంలో తప్పులు..
ఆరోగ్య బీమా దరఖాస్తు పత్రాన్ని నింపేటప్పుడు పాలసీదారులు కాస్త నిర్లక్ష్యంగానే ఉంటారు. చాలా సందర్భాల్లో వారు దాన్ని కనీసం చూడకుండానే సంతకాలు చేసేస్తుంటారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినప్పుడూ ఇలాగే వ్యవహరిస్తారు. కొన్నిసార్లు తెలిసి, మరికొన్నిసార్లు తెలియకుండానే పొరపాటుగా సమాచారాన్ని అందిస్తుంటారు. పేరులో అక్షర దోషాలు, వయసు తప్పుగా పేర్కొనడం, ధూమపాన అలవాట్లు, వార్షిక ఆదాయం వివరాలను వెల్లడించకపోవడంలాంటివి సాధారణంగా జరిగే పొరపాట్లు. క్లెయిం చేసుకోవాల్సి వచ్చిన సందర్భంలో ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు. ఇలాంటి సందర్భాల్లో బీమా సంస్థ క్లెయింను ఇవ్వడానికి నిరాకరించవచ్చు. కాబట్టి, దరఖాస్తు నింపేటప్పుడు పూర్తి అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉంది.
చరిత్రను చెప్పకోవడం..
ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీ వైద్య చరిత్ర గురించి కచ్చితమైన వివరాలను అందించాలి. అన్ని వివరాలూ చెప్పేస్తే.. పాలసీ ఇవ్వరని, ప్రీమియం అధికంగా వసూలు చేస్తారని భావిస్తుంటారు చాలామంది. అన్ని వేళలా ఇలాగే ఉండదు. మీరు ఆరోగ్య వివరాలు దాచిపెట్టి, పాలసీ తీసుకున్నా.. ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణకు ధూమపానం గురించి పాలసీలో చెప్పలేదు అనుకుందాం.. కానీ, ఏదైనా సందర్భంలో ఆసుపత్రిలో చేరినప్పుడు డాక్టరుకు ఆ సంగతి చెప్పేస్తారు. అలాంటప్పుడు మోసపూరితంగా పాలసీ తీసుకున్నారని బీమా సంస్థ పేర్కొంటుంది. ఇలాంటివి నివారించేందుకు వ్యక్తిగత ఆరోగ్యం గురించి అడిగిన వివరాలన్నీ చెప్పడం మంచిది.
పునరుద్ధరణ మర్చిపోతే..
అనేక సందర్భాల్లో పాలసీ పునరుద్ధరణ విషయాన్ని చాలామంది మర్చిపోతుంటారు. బీమా సంస్థలు నెల ముందు నుంచే ఈ విషయంలో పాలసీదారులకు సమాచారాన్ని ఇస్తుంటాయి. కొంతమంది ప్రీమియం మొత్తం సర్దుబాటు కాకపోవడంతో ప్రీమియం చెల్లించరు. కొంతమంది కావాలనే ఆలస్యం చేస్తుంటారు. సాధారణంగా గడువు ముగిసిన 30 రోజుల వరకూ పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది. పాలసీ గడువు ముగిసిన వెంటనే బీమా రక్షణ ఆగిపోతుంది. ఈ వ్యవధిలో అనుకోకుండా ఆసుపత్రిలో చేరాల్సి వస్తే పరిహారం లభించదు అన్న సంగతి మర్చిపోవద్దు.