అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజం గూగుల్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (NCLAT) తీర్పును వ్యతిరేకిస్తూ గూగుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. ఆండ్రాయిడ్ ఉత్పత్తులకు సంబంధించి తన ఆధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని.. అనైతికంగా పోటీ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) గతంలో రూ.1,337 కోట్ల జరిమానా విధించింది. దీనిపై గూగుల్ NCLATని ఆశ్రయించింది. అక్కడ వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. జరిమానాలో 10 శాతం మొత్తాన్ని నాలుగు వారాల్లోగా జమ చేయాలని ఆదేశించింది. NCLAT తీర్పుపై స్టే విధించాలని కోరుతూ.. గూగుల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
గూగుల్‌కు షాక్.. సుప్రీంలో ఎదురుదెబ్బ.. వారంలోగా ఆ జరిమానా కట్టాల్సిందే!
గూగుల్ సంస్థకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ విధించిన జరిమానాను వ్యతిరేకిస్తూ గూగుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు అపరాధ రుసుమును వారంలోగా చెల్లించాలని గడువిచ్చింది.
దీనిపై తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్దీవాలా త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసును తిరిగి NCLATకి అప్పగించింది. మార్చి 31లోగా కేసును పూర్తి చేయాలని తెలిపింది. గతంలో CCI విధించిన అపరాధ రుసుములో 10శాతం చెల్లించేందుకు గూగుల్‌కు వారం రోజులు గడువిచ్చింది. మరోవైపు కేసు విచారణ కోసం గురువారం నుంచి 3 రోజుల్లోగా ఎన్‌సీఎల్‌ఏటీని సంప్రదించాలని గూగుల్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. సీసీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకటరమణన్ గతంలో వాదనలు వినిపించారు. గూగుల్ సంస్థ ఐరోపా దేశాల్లో ఒక విధంగా, భారత్‌లో మరోలా వ్యవహరిస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. యూరోపియన్ కమిషన్ ఆదేశాలను గూగుల్ పాటిస్తోందని తెలిపారు.