తెలంగాణ

telangana

ETV Bharat / business

'జాతీయ జెండా వెనుక దాక్కుని దేశం లూటీనా..?'.. అదానీకి హిండెన్​బర్గ్ కౌంటర్ - అదానీ గ్రూప్​పై ఆరోపణలు

అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్‌కు అదానీ సంస్థకు మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. భారతదేశ వృద్ధిపై అక్కసుతోనే హిండెన్ బర్గ్ అసత్య ఆరోపణలు చేస్తోందంటూ 413 పేజీల స్పందనను తెలియజేసిన కొద్దిగంటల్లోనే ఆ సంస్థ మరోసారి విరుచుకుపడింది. జాతీయవాదం పేరు చెప్పి చేసిన మోసాన్ని కప్పి పుచ్చుకోలేరంటూ అదానీ గ్రూప్‌ను ఉద్దేశించి హిండెన్‌ బర్గ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మరోవైపు.. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత భారత స్టాక్‌ మార్కెట్లలో అదానీ గ్రూపు షేర్లు మిశ్రమ ఫలితాలను చవిచూస్తున్నాయి.

hindenburg research adani
కుప్పకూలిన అదానీ షేర్లు

By

Published : Jan 30, 2023, 12:02 PM IST

Updated : Jan 30, 2023, 12:30 PM IST

అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌కు అదానీ గ్రూప్‌నకు మధ్య వాద ప్రతివాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్‌ గతవారం ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపింది. ఈ హిండెన్ బర్గ్‌ నివేదికపై స్పందించిన అదానీ గ్రూప్‌ 413 పేజీల సుదీర్ఘ స్పందనను తెలిపింది. దానిపై తాజాగా స్పందించిన హిండెన్‌బర్గ్‌.. జాతీయవాదం పేరుతో చేసిన మోసాన్ని దాచిపెట్టలేరంటూ ఎదురుదాడి చేసింది. కీలకమైన విషయాల నుంచి అదానీ గ్రూప్‌ దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోందన్న హిండెన్‌బర్గ్.. అందుకే జాతీయ వాదాన్ని లేవనెత్తుతోందని మండిపడింది.

భారత్‌పై దాడి చేసేందుకే తాము నివేదిక ఇచ్చామన్నట్లు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు హిండెన్‌బర్గ్‌ స్పష్టం చేసింది. భారత్‌ శక్తిమంతమైన ప్రజాస్వామ్యమని ఉత్తేజకరమైన భవిష్యత్తుతో అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందుతోందని విశ్వసిస్తున్నట్లు హిండెన్‌ బర్గ్‌ తెలిపింది. అయితే జాతీయవాదం ముసుగులో భారత్‌ను క్రమపద్ధతిలో దోచుకుంటున్న అదానీ గ్రూప్‌.. దేశ భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతోందనేది కూడా నమ్ముతున్నామని స్పష్టం చేసింది. జాతీయ జెండా వెనుక దాక్కుని దేశాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించింది. సంపన్నులైనా, పేదవారైనా మోసం ఎప్పటికీ మోసమేనని పేర్కొంది. తమ నివేదికలో 82 ప్రశ్నలడిగితే అందులో 62 ప్రశ్నలకు అదానీ గ్రూప్‌ సమాధానాలు చెప్పలేక పోయిందని తెలిపింది.

అంతకుముందు హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై.. అదానీ గ్రూప్‌ సుదీర్ఘ వివరణ ఇచ్చింది. భారత్‌తోపాటు భారత సంస్థలు సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిందని అదానీ గ్రూపు తెలిపింది. తమపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని అసత్యాలని పేర్కొంటూ 413 పేజీల స్పందనను వెల్లడించింది. మార్కెట్‌లో తప్పుడు ప్రచారం చేసి ఆర్థిక లాభాలు పొందాలనే దురుద్దేశంతోనే హిండెన్‌బర్గ్‌ కుట్రకు తెరలేపిందని అదానీ గ్రూప్ ఆరోపించింది. అదానీ ఎంటర్ ప్రైజెస్.. ఎఫ్​పీఓకు ముందు ఈ నివేదికను విడుదల చేయడం వెనుక హిండెన్ బర్గ్ ఉద్దేశమేమిటో అర్థం చేసుకోవచ్చని పేర్కొంది. చట్టాలు, నిబంధనలను ఎల్లప్పుడూ పాటిస్తున్నామన్న అదానీ గ్రూపు.. వాటాదార్ల ప్రయోజనాలను కాపాడేందుకు అత్యున్నత పాలనా ప్రమాణాలను పాటించేందుకు.. కట్టుబడి ఉన్నామని వివరించింది.

అదానీ గ్రూప్​నకు మిశ్రమ ఫలితాలు
హిండెన్​బర్గ్ నివేదిక నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్​లో అదానీ గ్రూపు షేర్లు మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు చెరో 10 శాతం లాభాలు నమోదు చేశాయి. మరోవైపు అదానీ గ్రూప్ మిగతా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Jan 30, 2023, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details