ఊహించిందే జరిగింది. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా అనుకున్నట్లుగానే ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. కంపెనీలో పనిచేస్తున్న 11 వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల సంఖ్యను 13 శాతం మేర తగ్గించుకుంటున్నట్లు మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.
ఫేస్‌బుక్ ఉద్యోగులకు షాక్.. 11వేల మందికి ఉద్వాసన.. నియామకాలు బంద్
ఫేస్‌బుక్ ఉద్యోగులకు షాక్ తగిలింది. 11 వేల మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్రకటించింది. మెటా చరిత్రలో అత్యంత కఠినమైన మార్పు ఇదేనని సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.
ఉద్యోగుల తొలగింపు విషయాన్ని మెటా చరిత్రలో కఠినమైన రోజుగా జుకర్‌బర్గ్ అభివర్ణించారు. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం అంటే 11 వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు చెప్పారు. అలాగే, కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి పెడతామని, నియామకాలను నిలిపివేయనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం వరకు నియామక ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తొలగింపునకు గురైన ఉద్యోగులకు ఈ సందర్భంగా మార్క్ క్షమాపణ చెప్పారు.
2004లో ఫేస్‌బుక్ ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగాలను తొలగించడం ఇదే తొలిసారి. డిజిటల్ ప్రకటనల ఆదాయం తగ్గుముఖం పట్టడం, మాంద్యం భయాలు వెంటాడుతున్న వేళ మెటా నుంచి ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. ప్రస్తుతం మెటాలో సుమారు 87 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్ సైతం సగం మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. మరోవైపు సిలికాన్‌వ్యాలీకి చెందిన ఇతర కంపెనీలు సైతం నియామకాలను తగ్గించుకోవాలని ఇప్పటికే నిర్ణయించాయి.