investment plans: ప్రస్తుతం మన దేశంలో ధరల పెరుగుదల ఊహించిన దానికన్నా అధికంగా ఉంది. ఈ అధిక ద్రవ్యోల్బణం వల్ల పెట్టుబడుల విలువ వేగంగా తగ్గిపోతుంది. ఉదాహరణకు ఒక పెట్టుబడి పథకంపై 7 శాతం రాబడి వస్తుందనుకుందాం. ద్రవ్యోల్బణం 6 శాతం ఉంటే.. నికర రాబడి 1 శాతం మాత్రమే. కాబట్టి, ఏదైనా పెట్టుబడి పథకాన్ని ఎంచుకునేటప్పుడు.. సగటు రాబడి ద్రవ్యోల్బణాన్ని మించి కనీసం 2-3 శాతం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు మార్గం సుగమమవుతుంది.
పసిడి మార్గం..:ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే పెట్టుబడి సాధనం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బంగారమే. అధిక ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థలన్నీ పసిడినే నమ్ముకుంటాయి. బంగారం ద్వారా వచ్చే రాబడులు ప్రతిసారీ అధికంగా ఉండక పోవచ్చు. అయితే, అనిశ్చితి అధికంగా ఉన్నప్పుడు, యుద్ధం వంటివి వచ్చినప్పుడు నమ్మకమైన మదుపుగా దీన్ని పేర్కొనవచ్చు. దీర్ఘకాలిక వ్యూహంతో దీన్ని ఎంచుకున్నప్పుడు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. నేరుగా బంగారాన్ని కొనడం, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు, సావరీన్ గోల్డ్ బాండ్లు (ఎస్‌జీబీ) ఇందుకోసం పరిశీలించవచ్చు. ఎస్‌జీబీలో పెట్టుబడులు పెట్టినప్పుడు 2.5 శాతం వార్షిక రాబడిని అందిస్తుంది. వ్యవధి తీరాక వచ్చిన మొత్తంపై మూలధన రాబడి పన్ను ఉండదు.
ఈక్విటీలతో..:స్టాక్ మార్కెట్ ఆధారిత పెట్టుబడులు.. అంటే నేరుగా షేర్లలో మదుపు చేసినా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకున్నా కాస్త నష్టభయం ఉంటుంది. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పుడు స్వల్పకాలంలో వీటిలో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇవి వేగంగా స్పందిస్తుంటాయి. దీర్ఘకాలంలో మదుపరులకు స్టాక్ మార్కెట్ ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. ఈక్విటీ ఫండ్లు, షేర్లలో మదుపు చేయాలనుకున్నప్పుడు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) ఎంచుకోవడం మంచిది. దీనివల్ల రూపాయి సగటు ప్రయోజనం లభిస్తుంది. నష్టభయమూ తగ్గుతుంది. ఈక్విటీల్లో మదుపు చేస్తున్నప్పుడు వీలైనంత వరకూ వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి.
మీరు ఎంత మేరకు నష్టాన్ని తట్టుకోగలరు, ఎంత రాబడిని ఆశిస్తున్నారు అనే అంశాలను స్పష్టంగా తెలుసుకున్నాకే ఈక్విటీ ఆధారిత పెట్టుబడులను ఎంచుకోవాలి. ఉన్న డబ్బంతా వీటికే కేటాయించకూడదు. దీర్ఘకాలం కొనసాగించినప్పుడే వీటి ద్వారా ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడిని అందుకోగలం. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వారు.. నేరుగా షేర్లలో మదుపు చేసే బదులు, మ్యూచువల్ ఫండ్లను పరిశీలించడమే మేలు.