Customers No Need to Give Their Mobile Number at shopping Malls: ఏదైనా మాల్‍కు వెళ్లి షాపింగ్ చేసి బిల్ చెల్లించే సమయంలో అక్కడ కౌంటర్ దగ్గర మాల్ సిబ్బంది.. కస్టమర్ మొబైల్ నెంబర్ (Mobile Number) అడుగుతారు. సూపర్ మార్కెట్‌కు (Super Market) వెళ్లినా ఇదే పరిస్థితి. ఏవైనా వస్తువులు కొని బిల్ చెల్లించడానికి మొబైల్ నెంబర్‌తో అవసరం ఏం ఉంటుందన్న అనుమానం కూడా కస్టమర్లకు రాదు. మొబైల్ నెంబర్ చెప్పేసి, బిల్ పేమెంట్ చేసి వెళ్లిపోతుంటారు.
మాల్స్, సూపర్ మార్కెట్లోలనే కాదు వాటి బయట కూడా లక్కీ డ్రా పేరుతో ప్రజల ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలు తెలుసుకునేవారు కనిపిస్తుంటారు. వీరి చేతుల్లోకి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ వెళ్తే మోసాలకు దారితీయొచ్చు. ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా మోసాలు జరుగుతున్న ఘటనలు పెరుగుతుండటంతో.. కస్టమర్ల ప్రైవసీకి మరింత భద్రత కల్పించేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రిటైల్ దుకాణాల్లో బిల్లు జనరేట్ చేసేటప్పుడు వినియోగదారులు ఫోన్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈమేరకు రిటైలర్స్‌కు అడ్వైజరీ జారీ చేసింది.
షాపింగ్ మాల్స్, రెస్టారెంట్‌లలో కొత్త మార్గదర్శకాలు
షాపుల్లో లేదా బయట.. కస్టమర్ల నుంచి ఫోన్ నెంబర్లు సేకరించకూడదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. వ్యక్తిగత వివరాలు అందించే వరకు తాము బిల్ ప్రాసెస్ పూర్తి చేయలేమని కొన్ని షాపుల్లో చెబుతుంటారని.. ఇది కస్టమర్ల రక్షణ చట్టం ప్రకారం అన్యాయమైన, నిర్బంధ వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని వెల్లడించారు. ఫోన్ నెంబర్లు, ఇతర సమాచారాన్ని సేకరించడం వెనుక ఎటువంటి హేతుబద్ధత లేదని ఆయన అన్నారు.