తెలంగాణ

telangana

ETV Bharat / business

క్రెడిట్​ కార్డ్​ అప్​గ్రేడ్​ చేసేముందు.. ఈ టిప్స్​ ఫాలో అవుతున్నారా?

Credit Card Upgrading Tips : ప్రస్తుత రోజుల్లో క్రెడిట్​ కార్డు వాడకం కూడా తప్పనిసరి అన్నట్లుగా మారింది. అయితే క్రెడిట్​ కార్డు జారీ సంస్థలు తొలుత పెద్ద పెద్ద ఆఫర్లు లేని కార్డును మాత్రమే అందిస్తాయి. క్రమక్రమంగా ఆదాయం పెరుగుతున్న కొద్దీ, క్రెడిట్​ స్కోరును బట్టి ప్రత్యేక ప్రయోజనాలు అందించే కార్డుకు అప్​గ్రేడ్​కు అవ్వాలని సూచిస్తుంటుంది. అయితే.. కార్డు అప్​గ్రేడ్​ చేసుకోవడానికి ముందు ఈ టిప్స్​ ఫాలో అవుతున్నారా మరి?

Credit Card Upgrading Tips for beginners Follow These steps
Credit Card Upgrading Tips for beginners Follow These steps

By

Published : Aug 30, 2022, 5:43 PM IST

Credit Card Upgrading Tips : తొలిసారి క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు జారీ సంస్థలు 'ప్రవేశ స్థాయి ప్రయోజనాలు' ఉన్న కార్డును మాత్రమే అందజేస్తాయి. ఇవి మీ క్రెడిట్‌ ప్రయాణాన్ని ప్రారంభించడానికి అనువుగా ఉంటాయి. రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ప్రయాణ రాయితీలు, లాంజ్‌ అనుమతి.. వంటి ఆకర్షణీయ ప్రయోజనాలను అందజేయవు. సమయం గడిచే కొద్దీ మీ ఆదాయం పెరుగుతుంది. క్రెడిట్‌ స్కోర్‌ మెరుగుపడుతుంది. అప్పుడు మీ ఖర్చుకు అనుగుణంగా ప్రత్యేక ప్రయోజాలను అందించే క్రెడిట్‌ కార్డుకు అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు జారీ సంస్థలు అవకాశం కల్పిస్తాయి.
అయితే, కార్డును అప్‌గ్రేడ్‌ చేసుకోవడానికి ముందు ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకోండి..

మీ ఖర్చుల తీరుకు సరిపోయేలా..
మనం చేసే ఖర్చులు వివిధ కేటగిరీల్లోకి వస్తాయి. ఉదాహరణకు ప్రయాణాలు, ఇంధనం, నిత్యావసరాలు, షాపింగ్‌. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు ఏదో కేటగిరీలో ప్రత్యేక ప్రయోజనాల్ని కల్పించేలా ఆఫర్లను అందిస్తుంటాయి. మిగిలిన ప్రయోజనాలు అన్నింటిలో సాధారణంగా ఉంటాయి. ఉదాహరణకు మనం తరచూ ప్రయాణం చేయాల్సి ఉంటే.. ట్రావెల్‌ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. వీటి వల్ల విమాన టికెట్లపై రాయితీ లభిస్తుంది. విమానాశ్రయాల్లో లాంజ్‌కి ఉచిత అనుమతి ఉంటుంది. అలాగే ఇంధన కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలుపై రాయితీ లభిస్తుంది. ఈ నేపథ్యంలో మీ ఖర్చులు ఏ కేటగిరీలో అధికంగా ఉంటాయో గమనించి.. దానికి తగ్గట్టుగా కార్డుని అప్‌గ్రేడ్‌ చేసుకోండి.

రివార్డు పాయింట్ల వివరాలను తెలుసుకోండి..
మీకు ఏ రకమైన కార్డు కావాలో తెలుసుకున్న తర్వాత వివిధ సంస్థలు ఇచ్చే ఆఫర్లను అర్థం చేసుకోండి. వాటి నుంచి అందే ప్రయోజనాలను పోల్చి చూడండి. ఒకవేళ మీరు షాపింగ్‌ కార్డుని ఎంచుకుంటే.. రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌, రాయితీ ఇలా ఏ రూపంలో ఎంతమేర ప్రయోజనం లభిస్తుందో చూసుకోండి. కొన్ని కార్డులు ప్రత్యేకమైన బ్రాండ్లపై మాత్రమే ఆఫర్లను అందజేస్తుంటాయి. మరికొన్ని ఆన్‌లైన్‌ షాపింగ్‌కి మాత్రమే ప్రయోజనాల్ని వర్తింపజేస్తుంటాయి. వీటిలో మీకు ఏది సరిపోతుందో చూసుకోవాలి. కొన్ని కార్డులు ప్రయోజనాలపై గరిష్ఠ పరిమితి విధిస్తుంటాయి. మీ ఖర్చుకు.. వచ్చే రాయితీకి పొంతన ఉందో లేదో సరిచూసుకోవాలి. రూ.లక్ష ఖర్చుపై రూ.100 ప్రయోజనం లభిస్తే ఉపయోగం ఉండదు.

వార్షిక రుసుము ఎంత?
మంచి ప్రయోజనాలు ఉన్నాయంటే.. వార్షిక రుసుము కూడా అధికంగానే ఉండే అవకాశం ఉంది. అందుకే మీరు చెల్లించే రుసుముకి.. వచ్చే ప్రయోజనాలకి పొంతన ఉందో.. లేదో.. చూసుకోవాలి. మరికొన్ని సంస్థలు నిర్దిష్ట వ్యయ పరిమితిని నిర్దేశిస్తాయి. అది దాటితే వార్షిక రుసుముని రద్దు చేస్తాయి. అందుకే మీ ఖర్చు ఆ స్థాయిలో ఉందో.. లేదో.. చూసుకోండి. అందుకు తగ్గట్టుగానే రుసుము ఉండాలి. వ్యయ పరిమితి చేరుకోలేని స్థాయిలో ఉంటే.. అధిక రుసుము చెల్లించి ఉపయోగం ఉండదు.

క్రెడిట్‌ పరిమితి పెరగాలి..
కార్డుని అప్‌గ్రేడ్‌ చేసుకున్నప్పుడు సహజంగానే క్రెడిట్‌ లిమిట్‌ కూడా పెరుగుతుంది. అంటే క్రెడిట్‌ కార్డుపై మీకు లభించే మొత్తాన్ని జారీ సంస్థలు పెంచుతాయి. అత్యవసర సమయాల్లో క్రెడిట్‌ కార్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే ఎక్కువ క్రెడిట్‌ లిమిట్‌ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో.. ఫలితంగా క్రెడిట్‌ స్కోర్‌ కూడా మెరుగుపడుతుంది. అయితే, క్రెడిట్‌ లిమిట్‌ అనేది మీ ఆదాయం, మీరు అప్‌గ్రేడ్‌ చేసుకోబోయే కార్డుపై కూడా ఆధారపడి ఉంటుంది.

రివార్డు పాయింట్ల బదిలీ..
ముఖ్యంగా కార్డుని అప్‌గ్రేడ్‌ చేసుకునే ముందు ప్రస్తుతం మీ దగ్గర ఉన్న కార్డుపై ఉన్న ప్రయోజనాల్ని మరోసారి క్షుణ్నంగా పరిశీలించుకోండి. కొత్త కార్డు వల్ల అధిక ప్రయోజనాలు ఉంటేనే దానికి వెళ్లాలి. మరోవైపు ప్రస్తుతం ఉన్న కార్డు వల్ల మీరు అత్యధికంగా పొందుతున్న లబ్ధిని కొత్త కార్డు ద్వారా కోల్పోకుండా చూసుకోవాలి. అలాగే ఈ కార్డులో ఉన్న రివార్డు పాయింట్లు కొత్త కార్డుకి బదిలీ అయ్యేలా చూసుకోవాలి. లేదంటే.. వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ఇవీ చూడండి:క్రెడిట్​ కార్డు లిమిట్​ పెంపుతో లాభమా, నష్టమా

క్రెడిట్​ స్కోరు తగ్గితే వడ్డీ భారం మోయాల్సిందేనా

ఈఎంఐలు ఆల‌స్యంగా చెల్లిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా

ABOUT THE AUTHOR

...view details