తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​లో మరో వ్యాపారం బంద్.. అమెజాన్​కు ఏమైంది?

Amazon Food Delivery : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఫుడ్‌ డెలివరీ వ్యాపారాన్ని మూసివేయాలని నిర్ణయించింది. డిసెంబరు 9 నుంచి ఈ సర్వీసులను నిలిపివేయనున్నట్లు తెలిపింది.

amazon food delivery
అమెజాన్ ఫుడ్ డెలివరీ

By

Published : Nov 29, 2022, 2:24 PM IST

Amazon Food Delivery : వ్యయ నియంత్రణపై దృష్టిపెట్టిన ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌.. భారత్‌లో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే భారీ ఎత్తున ఉద్యోగాల కోతలతో పాటు ఎడ్యుటెక్‌, ఫుడ్‌ డెలివరీ వ్యాపారాలను మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ముచ్చటగా మూడో వ్యాపారానికీ మంగళం పాడింది. భారత్‌లో హోల్‌సేల్‌ డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

భారత్‌లో వ్యాపార కార్యకలాపాల నిలిపివేతపై అమెజాన్‌ నుంచి ప్రకటన రావడం వారం వ్యవధిలో ఇది మూడోది కావడం గమనార్హం. ఎడ్యుటెక్‌ మూసివేతపై నవంబరు 24న, ఫుడ్‌ డెలివరీపై నవంబరు 25న అమెజాన్‌ ఇండియా ప్రకటనలు చేసింది.

అమెజాన్‌ హోల్‌సేల్‌ డిస్ట్రిబ్యూషన్‌.. ప్రధానంగా బెంగళూరు, మైసూరు, హుబ్లీ నగరాల్లో నిర్వహిస్తోంది. చిన్న వ్యాపారులు ఈ వెబ్‌సైట్‌ ద్వారా హోల్‌సేల్‌ ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేసుకునే వీలుండేది. అయితే ఈ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు అమెజాన్‌ ఇండియా తాజాగా ప్రకటించింది. వార్షిక కార్యకలాపాల సమీక్ష ప్రక్రియలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

"మేం ఈ నిర్ణయాలను అనాలోచితంగా తీసుకోవట్లేదు. అయితే ప్రస్తుత కస్టమర్లు, భాగస్వాములను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాపార కార్యకలాపాలను దశలవారీగా నిలిపివేస్తాం. ఈ మూసివేతల కారణంగా ప్రభావితమయ్యే ఉద్యోగులకు మేం అండగా ఉంటాం. మా కస్టమర్లకు అత్యుత్తమ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సేవలను అందించడంపై మేం పూర్తిగా దృష్టిపెట్టాం" అని అమెజాన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

డిసెంబరు 29 నుంచి అమెజాన్‌ ఫుడ్‌ నిలిపివేత..
ఇక, డిసెంబరు 29 నుంచి అమెజాన్‌ ఫుడ్‌ సర్వీసును మూసివేయనున్నట్లు అమెజాన్‌ ఇటీవల వెల్లడించింది. రెండేళ్ల క్రితం కొవిడ్‌ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో దేశంలో హోం డెలివరీ సేవలు అత్యవసరమయ్యాయి. దీంతో అమెజాన్‌ ఇండియా.. జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లకు పోటీగా 2020 మే నెలలో 'అమెజాన్‌ ఫుడ్‌' పేరుతో ఆహార డెలివరీ సేవలను ప్రారంభించింది. బెంగళూరు సహా కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అయితే అప్పటికే స్విగ్గీ, జొమాటోకు మంచి ఆదరణ ఉండటంతో పాటు డుంజో, ఉబర్‌ ఈట్స్‌ వంటి స్టార్టప్‌లు కూడా ఫుడ్‌ డెలివరీ విభాగంలోకి అడుగుపెట్టాయి. దీంతో పోటీ విపరీతంగా పెరగడంలో 'అమెజాన్‌ ఫుడ్‌' ఆశించిన మేర ఫలితాలనివ్వలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ సేవలను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది.

కాగా.. కరోనా మహమ్మారి సమయంలో ఆన్‌లైన్‌ లెర్నింగ్‌కు డిమాండ్ పెరగడంతో అమెజాన్‌ అకాడమీని కూడా ఈ సంస్థ ప్రారంభించింది. అయితే ఇప్పుడు కరోనా అదుపులోకి రావడంతో విద్యాసంస్థలు యథావిధిగా నడుస్తున్నాయి. దీంతో ఈ అకాడమీని కూడా మూసివేస్తున్నట్లు ఇటీవల అమెజాన్‌ ప్రకటించింది. ప్రస్తుత బ్యాచ్‌ విద్యార్థుల పరీక్షా సన్నద్ధత కోర్స్‌ ముగిసే సమయంలోగా దశలవారీగా మూసివేత ప్రక్రియను చేపడతామని వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details