అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై అనిశ్చితుల నడుమ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజు నష్టాల్లో ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 230 పాయింట్ల పతనంతో 37, 559 వద్ద ముగిసింది. నేటితో కలిపి వరుసగా ఏడు సెషన్లలో దాదాపు 1,509 పాయింట్లు క్షీణించింది సెన్సెక్స్.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 58 పాయింట్ల నష్టానికి 11,302 వద్ద ట్రేడింగ్ ముగించింది.
ఇవి కారరణాలు
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు మదుపరుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి.
ట్రంప్ ప్రకటన ప్రకారం మే 10 నుంచి చైనా వస్తువులపై సుంకాల పెంపు అమలవ్వాల్సి ఉంది. అమెరికాతో 11 దఫా వాణిజ్య చర్చలకు చైనా ప్రతినిధుల బృందం వాషిగ్టన్ వచ్చింది. చర్చలు ఎలా సాగుతాయోనన్న ఆందోళనల మధ్య మార్కెట్లు కుదేలయ్యాయి.
ముఖ్యంగా అమెరికా చర్యలకు అదే స్థాయిలో ప్రతిచర్యలుంటాయన్న చైనా హెచ్చరికలు ఇందుకు ఊతమిచ్చాయి
ఇంట్రాడే సాగిందిలా
సూచీ | గరిష్ఠం | కనిష్ఠం |
సెన్సెక్స్ | 37,780.46 | 37,405.40 |
నిఫ్టీ | 11,357.60 | 11,255.05 |
లాభనష్టాలు
ప్రతికూల పరిస్థితుల్లోనూ.. సెన్సెక్స్‌లో యస్ బ్యాంకు షేర్లు 5.94 శాతం లాభపడటం విశేషం. బజాజ్ ఫినాన్స్ 1.65 శాతం, హీరో మోటార్స్ 1.17 శాతం, టీసీఎస్ 0.75 శాతం, హెచ్‌యూఎల్ 0.75 శాతం, బజాజ్ ఆటో 0.70 శాతం లాభాలు నమోదు చేశాయి.
రిలయన్స్ అత్యధికంగా 3.41 శాతం నష్టాన్ని నమోదు చేసింది. కోల్ ఇండియా 2.53 శాతం, ఎన్టీపీసీ 2.33 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.29 శాతం, భారతీ ఎయిర్టెల్ 1.64 శాతం, వేదాంత 1.29 శాతం నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు ఇలా
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ వాణిజ్య యుద్ధ భయాలతో నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా షాంఘై సూచీ 1.48 శాతం, హాంకాంగ్ సూచీ-హాంగ్ సెంగ్ 2.39 శాతం, జపాన్ సూచీ-నిక్కీ 0.93 శాతం, దక్షిణ కొరియా సూచీ-కోస్పీ 3.04 శాతం నష్టపోయాయి.
ఐరోపా సూచీలు దాదాపు అన్నీ నష్టాలతోనే ట్రేడింగ్ ప్రారంభించాయి.
రూపాయి, ముడి చమురు
సెషన్ ముగింపు ట్రేడింగ్‌లో రూపాయి 22 పైసలు నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.93 వద్ద ఉంది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.10 శాతం తగ్గింది. బ్యారెల్ ముడి చమురు ధర 70.30 డాలర్లకు చేరింది.
ఇదీ చూడండి: కరెన్సీ నోటుపై అక్షర దోషం- 7నెలలకు గుర్తింపు