Stock Market Close: రికార్డు స్థాయి నష్టాల మరుసటి రోజే స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. క్రితం సెషన్లో భారీ నష్టాల నేపథ్యంలో.. కనిష్ఠాల వద్ద ఆరంభంలో కొనుగోళ్ల మద్దతు లభించింది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1329 పాయింట్లు(2.44%) పెరిగి 55 వేల 859 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్ల లాభంతో సెషన్‌ను ప్రారంభించింది. ఉదయం 9.30 గంటల అనంతరం.. మరింత పుంజుకుంది. ఓ దశలో 1650 పాయింట్లకుపైగా పెరిగి 56 వేల 184 వద్ద సెషన్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. 55,299 వద్ద కనిష్ఠాన్ని తాకింది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 410 పాయింట్ల (2.53%) లాభంతో 16,658 వద్ద సెషన్‌ను ముగించింది.
బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు 4 శాతం చొప్పున పెరిగాయి. బ్యాంకింగ్, విద్యుత్, లోహ, రియాల్టీ రంగం షేర్లు 4 నుంచి 6 శాతం మేర లాభపడ్డాయి.
మొత్తంగా 2567 షేర్లు రాణించాయి. 724 షేర్లు డీలాపడ్డాయి. 89 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
అమెరికా మార్కెట్లు కూడా..
అమెరికా సహా ఇతర ఐరోపా దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లలో నాస్డాక్ 3 శాతానికిపైగా పెరిగింది. ఎస్ అండ్ పీ 1.50 %, డౌ 0.28 శాతం లాభపడ్డాయి. దీనికి అనుగుణంగానే.. ఆసియా మార్కెట్లు కూడా తేరుకున్నాయి.
లాభనష్టాల్లో..
బీఎస్ఈ 30 ప్యాక్‌లో నెస్లే ఇండియా (0.25 శాతం డౌన్) తప్ప అన్నీ లాభపడ్డాయి. టాటా స్టీల్ అత్యధికంగా 6 శాతానికిపైగా పెరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్ భారీగానే పుంజుకున్నాయి.
నిఫ్టీ 50లో బ్రిటానియా, హెచ్‌యూఎల్ స్వల్పంగా నష్టపోయాయి.
Ukraine Russia War: ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా.. గురువారం సెషన్లో దేశీయ సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్ 2702 పాయింట్లు కోల్పోయింది. దాదాపు రెండేళ్లలోనే ఒకరోజు అతిపెద్ద నష్టం ఇదే. నిఫ్టీ 815 పడి.. 16 వేల 300 దిగువకు చేరింది.
ఉక్రెయిన్ సంక్షోభంతో.. విదేశీ సంస్థాగత మదుపరులు(ఎఫ్ఐఐ) గురువారం రూ. 6,448 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
ఇవీ చూడండి:భారీగా పెరిగిన బంగారం ధరలు- ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో గ్యాస్ ధరకు రెక్కలు- వాటికి తీవ్ర కొరత!