గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్లు బాగా వృద్ధి సాధించాయి. కరోనా వల్ల మార్చిలో పడిపోయిన మార్కెట్లు మళ్లీ కొవిడ్ కంటే ముందు స్థాయికి చేరుకోవటమే కాకుండా ఇప్పుడు ఆ స్థాయి కంటే ఎక్కువ వద్ద ట్రేడవుతున్నాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సైంజీ సూచీ ఇంట్రాడేలో మొదటి సారి 50వేల పాయింట్ల మైలురాయిని దాటింది. కేవలం మన దేశంలోని సూచీలే కాకుండా అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు జీవన కాల గరిష్ఠాల వద్దనే ట్రేడవుతున్నాయి.
స్టాక్ మార్కెట్ల ఊపుకు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు గాడిన పడతుండటమే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు మనీ సర్కులేషన్ను కేంద్ర బ్యాంకులు పెంచాయి. దీనితో లిక్విడిటీ సులభతరం అయిపోయింది. వడ్డీ రేట్లు జీవన కాల కనిష్ఠం వద్ద ఉన్నాయి. ఈ కారణాలతో ఈక్విటీ మార్కెట్లు రికవరీ అవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం మార్కెట్లు ప్రతికూలంగా కదులుతాయని అనుకున్నప్పటికీ... ఉద్దీపనల ఆశలతో ఇంకా కొంచెం వృద్ధి సాధించాయని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.
"అమెరికాలో జో బైడెన్ అధికారంలోకి వస్తే ట్యాక్స్ రేట్లు పెరుగుతాయన్న భావనలో ప్రతికూలంగా సూచీల గమనం ఉంటుందని అనుకున్నాం. కానీ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతం ఇచ్చేందుకు 2 బిలియన్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ఉంటుందని ప్రకటించటంతో సూచీలు మరింత వృద్ధి సాధించాయి. పన్నులు వెంటనే పెరగకుండా... నెమ్మదిగా పెరుగుతాయని భావవతో ఇది జరిగింది. కేంద్ర బ్యాంకుల లిక్విడిటీ పాలసీ, వడ్డీ రేట్లు తగ్గటం, ట్రంప్ హయాంలో అమెరికా ఉద్దీపనలు ర్యాలీకి ఎక్కువగా దోహదపడ్డాయి"
-సతీష్ కంతేటీ, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, జెన్ మనీ
'ముందే ఊహిస్తాయి'
ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో రికవరీ కానప్పటికీ మార్కెట్ సూచీలు మాత్రం కొవిడ్ ముందు కంటే ఎక్కువ స్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీని ఈక్విటీ మార్కెట్లు ముందే పసిగడతాయని.. మార్చిలో అదే జరిగిందని నిపుణులు అంటున్నారు. మార్చిలో సూచీలు పడిపోయిన అనంతరం ఆ త్రైమాసికం ఫలితాలు నిరాశజనకంగా ఉన్నాయని వారు వివరిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ వృద్ధిని మార్కెట్లు ఊహిస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.
మార్కెట్ మార్కెట్ మొత్తంగా చూసుకున్నట్లయితే ఓవర్ వ్యాల్యుయేషన్ లేదని విశ్లేషకులు అంటున్నారు. కొన్ని స్టాక్స్ విషయంలో మాత్రం వాల్యుయేషన్ ఎక్కువగానే ఉందని వారు భావిస్తున్నారు. కొన్ని మాత్రం ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉన్నాయని వారు అంచనా వేస్తున్నారు.