దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో లాభాలతో ముగిశాయి. 2018-19 చివరి త్రైమాసికంలో మంచి ఫలితాలను కనబరిచిన ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ షేరు విలువ 4.78 శాతం పెరగటం... ఇందుకు ప్రధాన కారణం.
బాంబే ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 138.73 పాయింట్లు(0.36 శాతం) పెరిగి... 38,905.84 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 46.90 పాయింట్లు(0.40) పాయింట్లు ఎగబాకి... 11,690 వద్ద స్థిరపడింది.
ఐటీ దిగ్గజాల త్రైమాసిక ఫలితాలు...
మార్చి 2019 త్రైమాసికానికి నికర లాభాలు రూ. 8,126 కోట్లుగా ప్రకటించింది టీసీఎస్. ఇది క్రితంతో పోల్చితే 17.7 శాతం వృద్ధితో సమానం. ఫలితంగా నేడు ఈ కంపెనీ షేర్లు దూసుకెళ్లాయి.
ఇదే త్రైమాసికంలో 10.5 శాతం వృద్ధితో రూ. 4,078 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ఇన్ఫోసిస్. వార్షికాదాయంలో మొత్తం 7.5 నుంచి 9.5 శాతం వరకు వృద్ధి కనబరిచింది. ఆదాయంపై ఆందోళనలు నెలకొన్నాయి.
అత్యధిక లాభాల్లోనివివే....
సెన్సెక్స్ సూచీలో టాటా మోటార్స్ అత్యధికంగా 7.04 శాతం లాభపడింది. తరవాతి స్థానాల్లో ఉన్న టీసీఎస్, కోల్ ఇండియా, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, కొటక్ బ్యాంకు, హెచ్సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ 4.78 శాతం వరకు వృద్ధి కనబరిచాయి.