తెలంగాణ

telangana

ETV Bharat / business

మల్టీక్యాప్ ఫండ్లకు సెబీ కొత్త నిబంధనలు - మల్టీక్యాప్ ఫండ్లకు సెబీ కొత్త నిబంధనలు

మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్లకు కొత్త పెట్టుబడి నిబంధనలను సెబీ ప్రకటించింది. కనీసం 75శాతం నిధులను ఈక్విటీ షేర్లపై మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్లు పెట్టుబడి పెట్టేలా నిబంధనలు తీసుకొచ్చింది. అదేవిధంగా 25 శాతం చొప్పున నిధులను లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టాలి.

SEBI announces new rules for multi-cap funds
మల్టీక్యాప్ ఫండ్లకు సెబీ కొత్త నిబంధనలు

By

Published : Sep 12, 2020, 5:49 AM IST

మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్లకు వర్తించే విధంగా సరికొత్త పెట్టుబడి నిబంధనలను సెబీ ప్రకటించింది. దీని ప్రకారం మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఇకపై కనీసం 75% నిధులను ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టాలి. గతంలో ఈ పరిమితి 65 % మాత్రమే. అదేవిధంగా కనీసం 25% చొప్పున నిధులను లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టాలి. ఈ నిబంధనలను ప్రస్తుత మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలన్నీ విధిగా అమలు చేయాలి. వచ్చే ఏడాది జనవరిలో యాంఫీ(అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా), షేర్ల జాబితా ప్రకటించిన తర్వాత ఒక నెల రోజుల్లో ఈ మేరకు పెట్టుబడులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

'మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్లు... వాటి ఉద్దేశాలను ప్రతిబింబించే విధంగా లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో పెట్టుబడి పెట్టాలి, అందువల్ల దానికి తగ్గట్లుగా నిబంధనల్లో మార్పులు చేయాలని నిర్ణయించాం'

-సెబీ

ప్రస్తుతం ఎన్నో మ్యూచువల్ పండ్లు.. పేరుకు మాత్రమే మల్టీక్యాప్ ఫండ్లు మాదిరిగా ఉన్నాయి. తమ అజమాయిషీ కింద సొమ్ములో అత్యధిక భాగాన్ని లార్జ్ క్యాప్ షేర్లలో పెట్టుబడి పెట్టి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లకు తక్కువ నిధులు కేటాయిస్తున్నాయి. ఇకపై ఈ పద్ధతి మారుతుంది. సెబీ నిర్దేశించిన గడువు సమీపించే కొద్దీ ఇటువంటి ఫండ్లు లార్జ్ క్యాప్ షేర్లలో పెట్టుబడులు తగ్గించి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లకు కేటాయింపులు పెంచాల్సి వస్తుంది. దీనివల్ల వచ్చే కొద్ది రోజుల్లో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లకు గిరాకీ పెరుగుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే సమయంలో లార్జ్ క్యాప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడికి అవకాశం ఉందని కూడా పేర్కొంటున్నాయి. మల్టీ క్యాప్ ఫండ్ల నుంచి దాదాపు రూ. 30,000 కోట్ల సొమ్ము మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల లోకి వచ్చే అవకాశం ఉందని సామ్ కో గ్రూప్ సీఈఓ జిమీత్ మోదీ వివరించారు.

ఆ 30 నిమిషాల్లోపే ఆర్థిక ఫలితాలు!

నమోదిత కంపెనీలు బోర్డుల అనుమతి లభించిన 30 నిమిషాల్లోగా ఆర్థిక ఫలితాలను ఎక్స్ఛేంజీలకు వెల్లడించాలని సెబీ శుక్రవారం ప్రతిపాదించింది. కార్పొరేట్ పాలన విధానాలను బలోపేతం చేయడం కోసం ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది. ప్రస్తుతం బోర్డు సమావేశం పూర్తయ్యాక 30 నిమిషాల్లోపు వెల్లడించాలన్న నిబంధన ఉంది.

ABOUT THE AUTHOR

...view details