కరోనా సంక్షోభం... ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. 2019లో దశాబ్దపు కనిష్ఠానికి ప్రపంచ వృద్ధి రేటు పతనం కావడాన్ని గుర్తుచేశారు. 2020లో వృద్ధి కొంతైనా పుంజుకుంటుందన్న ఆశలు ఇప్పుడు ఆవిరైపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.
కరోనా వ్యాప్తి తీవ్రత, వేగం, ఎంత కాలం ఈ మహమ్మారి కొనసాగుతుందన్న అంశాలపైనే... ప్రపంచ ఆర్థిక భవిత ఆధారపడి ఉంటుందని విశ్లేషించారు ఆర్బీఐ గవర్నర్. ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకుపోయే ప్రమాదముందని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం.. భారత్‌పైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు శక్తికాంత దాస్. అయితే... ముడి చమురు ధరల తగ్గుదల మాత్రమే మనకు లాభించే అంశం అవుతుందని చెప్పారు.