తెలంగాణ

telangana

ETV Bharat / business

రుణం మరింత తేలిక- 9 ఏళ్ల కనిష్ఠానికి వడ్డీరేట్లు - good news

రుణగ్రహీతలకు శుభవార్త. గృహ, వాహన రుణాలపై ఈఎంఐ భారం మరింత తగ్గనుంది. రిజర్వు బ్యాంకు వరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లు తగ్గించడమే ఇందుకు కారణం. ఆర్​బీఐ నిర్ణయంతో రెపో రేటు 9ఏళ్ల కనిష్ఠానికి దిగొచ్చింది.

రుణం మరింత తేలిక- 9 ఏళ్ల కనిష్ఠానికి వడ్డీరేట్లు

By

Published : Jun 6, 2019, 12:06 PM IST

Updated : Jun 6, 2019, 6:57 PM IST

ఆర్​బీఐ నిర్ణయాలపై ప్రముఖ వ్యాపార నిపుణులు శేఖర్​ రెడ్డి అభిప్రాయం

భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నెమ్మదిస్తున్న ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలిచేందుకు కీలక నిర్ణయాల్ని ప్రకటించింది రిజర్వ్​ బ్యాంకు. వృద్ధికి ఊతమిచ్చేలా... వడ్డీరేట్లను మరోసారి తగ్గించింది.

రెపో రేటును 25 బేసిస్​ పాయింట్ల మేర తగ్గించి శుభవార్త అందించింది. 6 నుంచి 5.75 శాతానికి మారుస్తూ నిర్ణయం తీసుకుంది ద్రవ్యపరపతి విధాన కమిటీ-ఎంపీసీ. ఫలితంగా... వడ్డీ రేటు 9 ఏళ్ల కనిష్ఠానికి దిగొచ్చింది. చివరిసారిగా 2010 జులైలో రెపో రేటు 5.75 శాతంగా ఉంది.

రిజర్వు బ్యాంకు ఈ ఏడాది వరుసగా రెపో రేటును మూడుసార్లు 25 పాయింట్ల చొప్పున మొత్తం 75 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తూ వచ్చింది. రివర్స్​ రెపో రేటును 5.50 శాతానికి, బ్యాంకు రేటును 6 శాతానికి చేర్చింది.

ఆర్‌బీఐ.. బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వేసే వడ్డీనే రెపో రేటు. ప్రస్తుతం ఈ రెపో రేటు తగ్గింపుతో.. బ్యాంకులూ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముంది. ఇది గృహ, వ్యక్తిగత, వాహన రుణాల వినియోగదారులకు తీపికబురు. వారి రుణాలపై ఈఎంఐల భారం తగ్గుతుంది.

గత ఫిబ్రవరి, ఏప్రిల్​తో పాటు తాజాగా తీసుకున్న వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయాన్ని బ్యాంకులూ అమలుచేయాలని కోరారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంతదాస్​.

భవిష్యత్తులోనూ...

వడ్డీ రేట్ల తగ్గింపుతో పాటు ఏకగ్రీవంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ ఎంపీపీ. ద్రవ్యపరపతి విధాన దృక్పథాన్ని న్యూట్రల్​ నుంచి అకామొడేటివ్​కు మార్చింది. తద్వారా భవిష్యత్​లో వడ్డీ రేట్లు మరింత తగ్గిస్తామని సంకేతాలిచ్చింది.

వృద్ధి రేటు అంచనాల తగ్గుదల...

భారత వృద్ధిరేటు.. 2018-19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 5.8 శాతంతో ఐదేళ్ల కనిష్ఠానికి చేరింది. ఇది గత కొన్ని త్రైమాసికాల్లో చైనా వృద్ధి రేటు కంటే తక్కువే. ఫలితంగా ఈ 2019-20 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది ఆర్​బీఐ. 7.2 నుంచి 7 శాతానికి సవరించింది.

ద్రవ్యోల్బణం అంచనాల్లో పురోగతి...

ద్రవ్యోల్బణం అంచనాలను పెంచింది ఆర్​బీఐ. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 3-3.1 గా నమోదవుతుందని అంచనా వేసింది. చివరిసారి ఏప్రిల్​లో జరిగిన సమావేశంలో... ద్రవ్యోల్బణం 2.9 నుంచి 3 శాతం వరకే ఉంటుందని పేర్కొంది కేంద్రబ్యాంకు.

రెండో అర్ధభాగంలో 3.5-3.8 నుంచి 3.4- 3.7 శాతానికి ద్రవ్యోల్బణం అంచనాలను తగ్గించింది.

ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికే పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది ఆర్​బీఐ. అందుకు తగినట్లే ధరల సూచీ అదుపులో ఉంటుందన్న అంచనాలు... భవిష్యత్తులో వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు పెంచుతున్నాయి.

బ్యాంకులూ తగ్గిస్తేనే...

ఆర్​బీఐ రెపోరేటును 25 బేసిస్​ పాయింట్లు తగ్గించడాన్ని స్వాగతించారు విశ్లేషకులు. బ్యాంకులూ వినియోగదారుల రుణాల పట్ల ఇలాగే వ్యవహరిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు వ్యాపార నిపుణులు శేఖర్​ రెడ్డి.

''గృహ రుణాలు తీసుకునే వారు, ఇళ్లు కొనుగోలు చేయాలనుకున్న వారికి ఈఎంఐ తగ్గడానికి బ్యాంకులు దోహదపడితే మనకు మంచిది. ఆర్​బీఐ రెపో రేట్లు తగ్గిస్తే అది నేరుగా వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చినట్లు కాదు. ఆర్​బీఐ వడ్డీ రేట్లు పెంచినప్పుడు మాత్రం వెంటనే రుణాలపై వడ్డీలను పెంచేసే బ్యాంకులు.. తగ్గించనప్పుడు మాత్రం నిర్ణీత సమయంలో వినియోగదారులకు ఆ ప్రయోజనాలు కల్పించట్లేదు. ఆర్​బీఐ మధ్యవర్తి ద్వారా ఈ ప్రయోజనాలన్నీ వినియోగదారులకు చేరేలా, బ్యాంకులకు సూచించేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.''

- శేఖర్​ రెడ్డి, క్రెడాయ్​ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ వ్యాపార నిపుణులు

ఎంపీసీ కీలక నిర్ణయాలు...

  • రెపో రేటు 25 బేసిస్​ పాయింట్ల తగ్గింపు
  • రివర్స్​ రెపో రేటు 5.50 శాతానికి మార్పు
  • బ్యాంకు రేటు 6 శాతానికి చేరుస్తూ నిర్ణయం
  • ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ లావాదేవీలపై రుసుముల ఎత్తివేత
  • వృద్ధి రేటు అంచనాల్లో తగ్గుదల.. 7.2 శాతం నుంచి 7కు తగ్గిస్తూ ప్రకటన

ద్రవ్యోల్బణం అంచనాల్లో పెరుగుదల.

  1. తొలి అర్ధభాగంలో 3-3.1 శాతంగా అంచనా
  2. రెండో అర్ధభాగంలో 3.4-3.7 శాతం నమోదవుతుందని పేర్కొన్న కమిటీ
  • ఏటీఎం వినియోగం ఛార్జీలపై సమీక్షకు కమిటీ​ ఏర్పాటుకు నిర్ణయం
  • ఆగస్టు 7న మరోసారి ఎంపీసీ భేటీ
Last Updated : Jun 6, 2019, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details