కేపిటల్ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణపై కరోనా ప్రభావం కనపడకుండా పోయింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్ల ద్వారా గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నిధుల సమీకరణ జరగడమే ఇందుకు నిదర్శనం. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓలు), మలివిడత పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓలు), ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్), ఇతర ఇష్యూల ద్వారా మొత్తంగా రూ.1,77,468 కోట్లను కంపెనీలు సమీకరించాయని ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. 2019లో ఈ విధంగా సమీకరించిన రూ.82,241 కోట్లతో పోలిస్తే ఈ విలువ 116 శాతం ఎక్కువ. ఐపీఓల్లో చిన్న మదుపర్లు పాల్గొనడం పెరగడం ఇందుకు ఓ కారణం కాగా.. క్యూఐపీలు, ఇన్విట్/ రీట్స్‌లకు విశేష ఆదరణ లభించడం మరో కారణమని ప్రైమ్ డేటాబేస్ తెలిపింది.
2017 రికార్డు బద్దలు..
ఈక్విటీ మార్కెట్లకు సంబంధించి 2017లో నమోదైన రూ.1,60,032 కోట్లే ఇప్పటివరకు ఒక ఏడాదిలో అత్యధిక నిధుల సమీకరణగా ఉంది. ఇప్పుడు రూ.1,77,468 కోట్ల సమీకరణతో ఆ రికార్డును 2020 బద్దలు కొట్టింది.
బాండ్ల ద్వారా రూ.7,475 కోట్లు
ఈక్విటీ ద్వారా సమీకరించిన రూ.1,77,468 కోట్లకు, బాండ్ల రూపేణా వచ్చిన రూ.7,485 కోట్లు కలిపితే 2020లో మొత్తం నిధుల సమీకరణ రూ.1,84,953 కోట్లకు చేరుతుంది. బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను కలిపితే 2019లో మొత్తం నిధుల సమీకరణ రూ.1,00,878 కోట్లు కాగా.. 2018లో రూ.93,352 కోట్లు.
ఐపీఓల్లో 2017దే హవా...