ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. యువత పెద్ద ఎత్తున ఇటువైపు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం చూస్తే.. ఏప్రిల్ 2020-జనవరి 2021 మధ్య కాలంలో దాదాపు 1.07 కోట్ల కొత్త డీమ్యాట్ ఖాతాలు ప్రారంభం అయ్యాయి. అంతకు క్రితం మూడు ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే.. ఈ సంఖ్య దాదాపు రెట్టింపుగా చెప్పొచ్చు. కరోనా పరిణామాల నేపథ్యంలో లాక్‌డౌన్, ఇంటి నుంచి పని తదితర కారణాలు ఎంతోమంది ఔత్సాహికులు స్టాక్ మార్కెట్‌పై దృష్టి సారించారు.
గత ఏడాదిన్నర కాలంగా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తుండటం, లాక్‌డౌన్‌తో పని వేళలు తగ్గడంతో మిగులు సమయం పెరిగింది. ఇదే సమయంలో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా తమకు రెండో ఆదాయం ఆర్జించేందుకు వీలవుతుందని భావించారు. చాలామంది కొత్తతరం మదుపరులు స్వల్పకాలంలోనే ఎంతోకొంత లాభాలు సంపాదించిన సంగతీ ఇక్కడ గమనార్హం. అయితే, మార్కెట్ ఎప్పుడూ ఒకేలాగా ఉండదన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే, ప్రతి రూపాయిని కాపాడుకునేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.
ఈక్విటీల్లో మదుపు చేసేందుకు కచ్చితంగా ఇలాంటి నిబంధనలుపాటించాలి అనేది ఏదీ ఉండదు. కానీ.. కొన్ని సూత్రాలు, వ్యూహాలు మాత్రం ఆచరించాల్సిందే.
నాణ్యతకే తొలి ప్రాధాన్యం
ఈక్విటీల్లో మదుపు చేసే వారు రకరకాలుగా ఉంటారు. కొంతమంది ఏడాది, రెండేళ్ల కోసం పెట్టుబడి పెడితే.. మరికొందరు 5-7 ఏళ్లకు మంచి కొనసాగుతారు. వ్యవధి ఎంత ఉన్నా.. కంపెనీల ఎంపికలో మాత్రం కొన్ని అంశాలను గుర్తు పెట్టుకోవాల్సిందే.. ప్రతి షేరుకూ కొంత చరిత్ర ఉంటుంది. దాన్ని గమనించాలి. ఎంత మేరకు లాభాలు ఇచ్చింది.. ఆ సంస్థ ఆదాయంలో వృద్ధి ఉందా?లాంటి అంశాలను క్షుణ్నంగా పరిశీలించాలి.
వ్యాపారం.. యాజమాన్యం..
మీరు మదుపు చేయాలనుకుంటున్న సంస్థ చేస్తున్న వ్యాపారం ఏమిటి? దాని యాజమాన్యం దానిని ఎలా నిర్వహిస్తోందన్నది ప్రధానంగా చూడాలి. మంచి యాజమాన్యం ఉన్న సంస్థలే దీర్ఘకాలం నిలదొక్కుకుంటాయని మర్చిపోవద్దు. అందుకే, షేర్లను కొనేటప్పుడు కేవలం సంస్థ వ్యాపారాన్ని మాత్రమే చూడకుండా.. యాజమాన్యం విధానాలు, వారి అకౌంటింగ్ పద్ధతులు, చిన్న మదుపరులపై వారు ఎలాంటి దృష్టితో ఉంటారు.. ఇలాంటి ఎన్నో అంశాలను పరిశీలించాలి. ఆ తర్వాతే కంపెనీలను ఎంచుకోవాలి.