కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థపై బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) సైతం వేటు వేసింది. ఆ సంస్థను ఎగవేతదారుగా ప్రకటించడమే కాకుండా... బీఎస్ఈ సభ్యత్వాన్ని రద్దు చేసింది. కార్వీ నుంచి రావాల్సిన బకాయిలు ఏవైనా ఉంటే 90 రోజుల్లోగా క్లెయిమ్ చేసుకోవాలని మదుపర్లకు సూచించింది. నవంబర్ 24 నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వచ్చినట్లు పేర్కొంది.
కార్వీని ఎగవేతదారుగా జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) ఇదివరకే ప్రకటించింది. ఎన్‌ఎస్‌ఈ సభ్యత్వాన్నీ రద్దు చేసింది.
ఇదీ చదవండి-కార్వీ స్టాక్బ్రోకింగ్పై ఎన్‌ఎస్‌ఈ వేటు
మరోవైపు, కొత్త ఖాతాదారులను చేర్చుకోకుండా కార్వీపై నిషేధం విధిస్తున్నట్లు సెబీ మంగళవారం స్పష్టం చేసింది. ఖాతాదారుల సెక్యూరిటీలను దుర్వినియోగం చేస్తోందన్న కారణంతో కార్వీపై నిషేధం విధిస్తూ ఏడాది క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో ఎన్‌ఎస్‌ఈ ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక అందిన తర్వాత తుది ఉత్తర్వులను జారీ చేసింది.
"ఖాతాదారుల సెక్యూరిటీలను అనధికారికంగా తన డీమ్యాట్ అకౌంట్లకు బదిలీ చేసుకుంది కార్వీ. క్లయింట్లు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని దుర్వినియోగం చేసింది. సొంత అవసరాల కోసం క్లయింట్ల సెక్యూరిటీలను ఉపయోగించుకుంది" అనే ఆరోపణలున్నాయి.