తెలంగాణ

telangana

ETV Bharat / business

కేసీఆర్​ చెప్పిన 'హెలికాప్టర్‌ మనీ'కి అర్థమేంటి?

లాక్‌డౌన్‌తో దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు నూతన ఆర్థిక విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపాదించారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు హెలికాప్టర్‌ మనీ, క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ (క్యూఈ) విధానాలు అమలు చేయాలని సూచించారు. హెలికాప్టర్‌ మనీ, క్యూఈ అంటే ఏమిటి? దీని వల్ల ఏం జరుగుతుంది?

HELICOPTER MONEY
కేసీఆర్​ చెప్పిన 'హెలికాప్టర్‌ మనీ' అంటే ఏంటి?

By

Published : Apr 12, 2020, 7:02 PM IST

Updated : Apr 12, 2020, 7:30 PM IST

దేశంలో కరోనా వైరస్‌ వల్ల విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలు మూతపడ్డాయి. వస్తు, సేవల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఆర్థిక వ్యవ్యస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. 2020-21 ఆర్థిక సంవ్సతరానికి దేశ జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం నుంచి 2.8 శాతానికి పడిపోవచ్చని ఇప్పటికే ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు హెలికాప్టర్‌ మనీ, క్యూఈ ఆర్థిక విధానాలు చేపట్టాలని ప్రధానికి సీఎం కేసీఆర్‌ సూచించడం వల్ల ఇవి తెరపైకి వచ్చాయి.

చిన్నతనంలో నోట్ల కట్టలు ఎవరైనా ఆకాశం నుంచి వెదజల్లితే ఎంత బాగుంటుందో అని మనలో చాలామంది అనుకునే ఉంటారు. ఇంచుమించు అలాంటిదే ఈ హెలికాప్టర్‌ మనీ. అంటే ప్రజలకు డబ్బులు ఉచితంగా ఇవ్వడం. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త ఫ్రెడ్‌మ్యాన్‌ 1969 హెలికాప్టర్‌ మనీ విధానాన్ని ప్రతిపాదించారు. 2002లో ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ బెన్‌ బెర్నాంకే దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ విషయంలో మన దేశంలో ఆర్‌బీఐది కీలక పాత్ర. దీని ప్రకారం నోట్ల ముద్రణ పెంచి ఆర్థిక వ్యవస్థలోకి పెద్దఎత్తున నగదును చలామణీలోకి తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం.

ప్రజలకు నేరుగా డబ్బులు చేరవేసి వారి కొనుగోలు శక్తిని పెంచడం దీని వెనుకున్న ఆంతర్యం. ప్రజల వద్ద డబ్బులు లేక కొనుగులు శక్తి తగ్గిపోయిన నేపథ్యంలో డబ్బులను విరివిగా ఇవ్వడం ద్వారా డిమాండ్‌ను, సప్లయ్‌ను పెంచడానికి ఈ విధానం దోహద పడుతుంది. క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ కూడా ఇలాంటిదే అయినా దీనికి ప్రభుత్వం వద్ద నుంచి ఆర్‌బీఐ బాండ్లు కొనుగోలు చేస్తుంది. దీని కింద కూడా నోట్లను అధికంగా ముద్రించాల్సి ఉంటుంది.

ఇంతకు ముందు ఈ విధానాన్ని అమెరికా, జపాన్‌ వంటి దేశాలు అవలంబించాయి. 2008లో సంభవించిన మాంద్యం పరిస్థితులను ఎదుర్కొనేందుకు అమెరికా హెలికాప్టర్‌ మనీ విధానాన్ని అనుసరించింది. 2016లో జపాన్‌ సైతం హెలికాప్టర్‌ మనీ విధానాన్ని అవలంబించింది. అయితే నోట్ల ముద్రణను ఎల్లప్పుడూ ఎందుకు చేపట్టకూడదనే ప్రశ్న తలెత్తవచ్చు. దేశంలో వస్తు సేవల ఉత్పత్తి ఆధారంగా నోట్లను ముద్రించి ఆర్‌బీఐ చలామణీలోకి తీసుకొస్తుంది. ఒకవేళ నిత్యం నోట్లను పెద్ద సంఖ్యలో ముద్రించి జనాలకు చేరవేస్తే కొన్నాళ్లకు దాని విలువ పడిపోయే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణం భారీ స్థాయిలో పెరిగిపోతుంది. అందుకే ఆర్థిక వ్యవస్థ మందగమనం ఎదుర్కొనేటప్పుడు మళ్లీ దానికి ఊతమిచ్చేందుకు ఇలాంటి విధానాలు చేపడుతుంటారు.

Last Updated : Apr 12, 2020, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details