ప్రభుత్వ ఆర్థిక విధానాలపై భాజపా నేత విమర్శలు ఆర్థిక వ్యవస్థపై అధికార పార్టీ(భాజపా) నేత సుబ్రమణియన్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం సరైన ఆర్థిక విధానాలు పాటించడం లేదని ఆయన విమర్శించారు.
శనివారం ముంబయిలో జరిగిన విశ్వ హిందూ ఆర్థిక సదస్సు ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా లాంటి గొప్ప కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ.. స్థూల ఆర్థిక పాలసీల విషయంలో సరైన విధానాలు పాటించలేదని అన్నారు.
"మనం ఇప్పుడు సరైన ఆర్థిక విధానాలు పాటించట్లేదు.. ఇలా చెబుతున్నందుకు క్షమించండి."
- సుబ్రమణియన్ స్వామి, మాజీ మంత్రి
దేశంలో సోవియట్ ఆర్థిక విధానాలను పెట్టినందుకు.. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూని విమర్శించారు సుబ్రమణియన్ స్వామి.
ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు వడ్డీ రేట్లు పెంచుతూ పోయారని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రుణాలపై వడ్డీ రేట్లు 9 శాతానికి మించకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు సుబ్రమణియన్. ఫిక్సెడ్ డిపాజిట్, సేవింగ్స్ ఖాతాలు 9 శాతం వడ్డీని పొందేలా చూడాలన్నారు.
ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న దేశానికి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అంతగా అవసరం లేదని అన్నారు. పొదుపును పెంచేందుకు ఆదాయపు పన్నును రద్దు చేయాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్ నూతన ఐటీ చీఫ్‌గా రోహన్ గుప్తా