దేశంలో నగదు రహిత లావాదేవీలు అందిస్తోన్న యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)పై కరోనా ప్రభావం పడింది. ఈ మేరకు జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్పీసీఐ) గణాంకాలు వెల్లడించాయి. ఐఎంపీఎస్ విధానం ద్వారా పనిచేసే యూపీఐ ద్వారా ఏ బ్యాంకుకైనా తక్షణమే నగదు బదిలీ చేసేందుకు అవకాశం ఉంది.
మార్చిలో రూ. 20 లక్షల కోట్లు..
ఫిబ్రవరిలో 132.57 కోట్ల లావాదేవీలు చేసిన యూపీఐ మార్చి నెలలో 128.68 కోట్ల ట్రాన్సాక్షన్లు మాత్రమే నమోదు చేయగలిగిందని గణాంకాలు వెల్లడించాయి. లావాదేవీల విలువ ఫిబ్రవరిలో రూ. 2.23 లక్షల కోట్లు ఉండగా.. మార్చిలో రూ. 2.06 కోట్లకు తగ్గిందని పేర్కొన్నాయి. అయితే ఏప్రిల్లో జరిగిన లావాదేవీల సమాచారం అందితేనే వాస్తవంగా ప్రతికూల ప్రభావం ఎంతనేది తెలుస్తుందని స్పష్టం చేశాయి.
ఐఎంపీఎస్లోనూ క్షీణత
ఐఎంపీఎస్ లావాదేవీల్లో కూడా తగ్గుదల నమోదైందని ఎన్పీసీఐ గణాంకాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరిలో రూ.24.78 కోట్ల లావాదేవీలు ఐఎంపీఎస్ ద్వారా జరగగా.. మార్చిలో ఆ సంఖ్య 21.68కి పడిపోయిందని వెల్లడించాయి. ఈ లావాదేవీల విలువ ఫిబ్రవరిలో రూ. 2.14 కోట్లుగా ఉందని.. మార్చిలో రూ. 2.01 కోట్లకు పడిపోయిందని స్పష్టం చేశాయి.