తెలంగాణ

telangana

ETV Bharat / business

నగదు లావాదేవీలతో జాగ్రత్త- లేదంటే ఐటీ నోటీసులొస్తాయ్​! - నగదు లావాదేవీలపై ఐటీ విధించిన పరిమితులు

పెట్టుబడి, పొదుపునకు సంబంధించి.. నగదు రూపంలో జరిపే లావాదేవీలపై ఆదాయపు పన్ను విభాగం పరిమితులు విధించింది. ఈ పరిమితి దాటిన వారికి నోటీసులు పంపడం, అవసరమైతే చర్యలకు కూడా ఉపక్రమిస్తోంది. మరి ఆయా లావాదేవీలపై ఉన్న పరిమితులు ఏమిటి? ఐటీ నోటీసులు రాకుండా జాగ్రత్తగా ఎలా ఉండాలి? అనే వివరాలు మీకోసం.

Transactions that cause IT notices
ఐటీ నోటీసులకు కారణమయ్యే లావాదేవీలు

By

Published : Jul 26, 2021, 1:12 PM IST

నగదు లావాదేవీలను తగ్గించడం, డిజిటల్​ ట్రాన్సాక్షన్స్ పెంచే ఉద్దేశంతో ఆదాయపు పన్ను శాఖ కొన్నాళ్లుగా నిబంధనలు కఠినతరం చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా పెట్టుబడులు, పొదుపు విషయంలో నగదు లావాదేవీలపై పరిమితులు విధించింది. ఆ పరిమితులు దాటిన వారికి నోటీసులు పంపి.. అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటోంది.

ఆదాయపు పన్ను నోటీసులు పంపేందుకు అవకాశం ఉన్న పలు సందర్భాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

పొదుపు / క‌రెంట్ ఖాతా...

ఒక వ్యక్తికి, పొదుపు ఖాతాలో నగదు డిపాజిట్ పరిమితి రూ.లక్ష‌. పొదుపు ఖాతాలో రూ.లక్షకు మించి నగదును జమ చేస్తే, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపొచ్చు. అదేవిధంగా, కరెంట్ ఖాతాదారులకు, పరిమితి రూ.50 లక్షలు. ఈ పరిమితిని దాటితే ఆదాయపు పన్ను నోటీసుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు...

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేటప్పుడు రూ.లక్ష పరిమితిని మించకూడదు. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో ఈ నగదు పరిమితిని ఉల్లంఘిస్తే ఆదాయపు పన్ను శాఖ నోటీసుకు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.

బ్యాంక్ ఎఫ్‌డీ (ఫిక్స్‌డ్ డిపాజిట్)...

బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో నగదు డిపాజిట్ రూ.10 లక్షలకు మించకూడదు. బ్యాంక్ డిపాజిటర్ ఒకరి బ్యాంక్ ఎఫ్‌డీ ఖాతాలో అంత‌కుమించి నగదు రూపంలో డిపాజిట్ చేయకూడ‌దు. పరిమితి మించితే ఐటీ నోటీసులు వచ్చేందుకు అవకాశం ఉంది.

మ్యూచువల్ ఫండ్ / స్టాక్ మార్కెట్ / బాండ్ / డిబెంచర్...

మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్, డిబెంచర్లలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు.. న‌గ‌దు రూపంలో పెట్టుబడిగా రూ.10 లక్షల పరిమితి మించకుండా చూసుకోవాలి. ఈ నగదు పరిమితిని మించితే ఆదాయపు పన్ను విభాగం.. మీ చివరి ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)ను తనిఖీ చేస్తుంది. నోటీసులు కూడా పంపొచ్చు.

రియల్ ఎస్టేట్...

ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు, రియల్ ఎస్టేట్ ఒప్పందంలో రూ.30 ల‌క్ష‌ల‌ పరిమితికి మించి నగదు లావాదేవీలు ఉంటే ఆదాయపు పన్ను శాఖకు స‌మాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంత‌కు మించి న‌గ‌దు లావాదేవీలు చేయ‌డాన్ని ఐటీ శాఖ ప్రోత్స‌హించ‌దు.

ఈ నిబంధనల నేపథ్యంలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ఆదాయపు పన్ను శాఖ ఎప్పటికప్పుడు లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న సాంకేతిక‌త‌తో ప‌రిమితికి మించి చేసే లావాదేవీల వివ‌రాలు సుల‌భంగా తెలిసిపోతాయి.

ఇదీ చదవండి:బంగారంపై అప్పు X పర్సనల్​ లోన్.. ఏది బెటర్​?

ABOUT THE AUTHOR

...view details