తెలంగాణ

telangana

ETV Bharat / business

అయోధ్య ఆలయానికి మూల 'స్తంభం'.. కరసేవక్‌పురం - ayodhya temple bhoomi puja

అయోధ్యలో రామ మందిర నిర్మాణ కల ఎప్పటికైనా సాకారమవుతుందనే విశ్వాసంతో కరసేవక్​పురంలో గత 30 ఏళ్ల క్రితమే రాతి స్తంభాలు రూపొందించడం ప్రారంభమించారు. రామ మందిరానికి కావాల్సిన రాతి నిర్మాణాలన్నీ ఇక్కడి నుంచే వస్తున్నాయి. నిర్మాణానికి వీలుగా దాదాపు 1.25 లక్షల ఘనపుటడుగుల రాతిని సిద్ధం చేసి ఉంచారు.

The main 'pillar' of the Ayodhya temple is Karasevakpuram
అయోధ్య ఆలయానికి మూల 'స్తంభం'.. కరసేవక్‌పురం

By

Published : Aug 5, 2020, 6:52 AM IST

కరసేవక్‌పురం... అయోధ్యలో రామమందిరం నిర్మించబోతున్న స్థలానికి చేరువగా ఉన్న ఓ కార్ఖానా. దాదాపు మూడు దశాబ్దాలుగా అక్కడి వారికి సుపరిచితమైన ప్రదేశం. ఎందుకంటే బుధవారం పునాదిరాయి పడబోతున్న ఆలయం మొత్తానికి కావాల్సిన రాతి నిర్మాణాలు ప్రాణం పోసుకుంటున్నది అక్కడే.

ప్రత్యేకత ఏమిటి?:ఎప్పటికైనా రామ మందిరం సాకారమవుతుందనే నమ్మకంతో రామజన్మభూమి న్యాస్‌ 1990లోనే దీనిని ఏర్పాటు చేసింది. రాతి స్తంభాలను నిల్వ చేయడానికి చోటు సరిపోక రాళ్లను చెక్కే పనిని 2006-11 మధ్య నిలిపివేసినా మిగిలిన కాలమంతా ఏకధాటిగా కొనసాగింది. నెలనెలా ఒక్క అమావాస్య నాడు మాత్రం పనులు చేయరు.

విస్తీర్ణం:మూడు ఎకరాలు

ఏర్పాటు ఉద్దేశం:రామ మందిరం నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు.... ఇలా అంతటా రాతినే వినియోగిస్తారు. ఎక్కడా ఇనుము కనిపించదు. దీనిని దృష్టిలో పెట్టుకుని గత 30 ఏళ్లుగా కరసేవక్‌పురంలో రాతిని చెక్కే పనులు చేస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈ ప్రాంతానికి భక్తుల తాకిడీ ఎక్కువే. రామాలయానికి సంబంధించి కలపతో సిద్ధం చేసిన నమూనా ఇక్కడ ఉంటుంది.

ఇప్పటి వరకు ఎంత పని పూర్తయింది?:నిర్మాణానికి వీలుగా దాదాపు 1.25 లక్షల ఘనపుటడుగుల రాతిని సిద్ధం చేసి ఉంచారు. 140 రాతి దూలాలు (బీమ్‌లు) తయారయ్యాయి. రామాలయంలో ఒక అంతస్తు మొత్తం కట్టడానికి కావాల్సిన స్తంభాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి.

రాతి సమీకరణ ఎలా?:రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ నుంచి, యూపీలోని ఆగ్రా నుంచి రాళ్లు రప్పించి, అవసరాలకు అనుగుణంగా చెక్కిస్తున్నారు. ఎక్కువగా ఎరుపు రంగు రాతిని వినియోగిస్తున్నారు. దాదాపు 50% పని ఇప్పటికే పూర్తయింది.

ఎంత సమయం పడుతుంది?:ఒక్క స్తంభాన్ని పూర్తిగా చెక్కడానికి దాదాపు ఏడాది పడుతోంది. ప్రతి స్తంభంపైనా 16 విగ్రహాలు చొప్పున ఉంటాయి. ప్రతి అంతస్తులోనూ ఇలాంటి 106 స్తంభాలు వస్తాయి.

ఎలా అమరుస్తారు?:పూర్తయిన రాతి స్తంభాలకు ఒక్కో క్రమ సంఖ్య కేటాయిస్తారు. ఆ ప్రకారం వాటిని అమర్చుకుంటూ వెళ్లాలి. స్తంభాలను అతకడానికి రాగితో రూపొందించిన క్లాంపులను వినియోగిస్తారు.

పర్యవేక్షణ ఎవరిది?:అహ్మదాబాద్‌కు చెందిన అన్నూభాయ్‌ సోంపుర ఈ వర్క్‌షాపును పర్యవేక్షిస్తున్నారు. మొదట ఆయన, తర్వాత కుటుంబ సభ్యులు అయోధ్యకు చేరుకుని కరసేవక్‌పురంలోనే బస చేశారు.

పూర్తయిన పనులకు కాలదోషం పట్టదా?:ఏళ్లు, ఇంకా చెప్పాలంటే దశాబ్దాల క్రితం చెక్కినవి కావడంతో శిలలు దుమ్మూధూళితో నిండినా వాటిని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరిపోతుందనేది నిర్వాహకుల మాట.

ABOUT THE AUTHOR

...view details