తెలంగాణ

telangana

ETV Bharat / business

పద్దు-19: కోట్లాది మంది ఆశల నడుమ కాసేపట్లో బడ్జెట్​

వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్​ .. కాసేపట్లో వార్షిక బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు ముహూర్తం. బడ్జెట్​పై భారీ ఆశలతో ఎదురుచూస్తోంది యావత్​ ప్రజానీకం. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్నిచ్చే ఉద్దీపన చర్యలతో పాటు.. సామాన్యులకు కొంత మేర పన్ను ప్రయోజనాల్ని కల్పించే చర్యలు ఈ బడ్జెట్​లో ఉండొచ్చని భావిస్తున్నారు. మరి సంస్కరణల అమలులో వేగం పెంచుతుందా..? సంక్షేమం దిశగా అడుగులు వేస్తుందా..? అనేది మరికొద్ది గంటల్లో స్పష్టమవుతుంది.

కోట్లాది ప్రజల ఆకాంక్షల నడుమ నేడే బడ్జెట్​

By

Published : Jul 4, 2019, 5:16 PM IST

Updated : Jul 5, 2019, 10:15 AM IST

పద్దు-19: సంక్షేమ మంత్రమా? సంస్కరణ పథమా?

ఎన్నో సమస్యలు.. మరెన్నో సవాళ్లు... 130 కోట్ల ప్రజల ఆకాంక్షలు.. వీటన్నింటి నడుమ 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్​ను కాసేపట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కేంద్రం.

భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకొస్తున్న మొదటి పద్దు కావడం వల్ల భారీ అంచనాలు ఉన్నాయి. బడ్జెట్​ ప్రజాకర్షకంగా ఉంటుందా.. సంస్కరణ బాట పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. పూర్తిస్థాయి కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్​కు ఇది మొదటి పరీక్ష.

ఉదయం 11 గంటలకు...

సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఉ.10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలో కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. సభలో ప్రవేశపెట్టే బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.

లోక్‌సభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్‌.

ఆశల పల్లకిలో..

ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్​లో మోదీ ప్రభుత్వం అనేక ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకుంది. మధ్య తరగతి వర్గాలకు ఊరటనిచ్చే పన్ను రిబేటు పెంపు లాంటివి ప్రకటించింది. రైతు సంక్షేమం కోసం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ బడ్జెట్​లోనూ కొత్త పథకాలతో పాటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు చోటుంటుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న పన్ను మినహాయింపు స్థాయిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. బడ్జెట్ స్లాబులనూ ప్రభుత్వం తగ్గిస్తుందని ఆశిస్తున్నారు.

గత బడ్జెట్ సందర్భంగా కిసాన్ సమ్మాన్ నిధిని కేవలం చిన్న, మధ్య తరహా రైతులకే వర్తింపజేశారు. ఒక్కో రైతుకు వార్షికంగా రూ.6వేలు ఇచ్చే ఈ పథకాన్ని రైతులందరికీ వర్తింపజేయాలని రెండోసారి అధికారంలోకి వచ్చాక నిర్వహించిన తొలి కేబినెట్​ సమావేశంలోనే నిర్ణయించింది మోదీ ప్రభుత్వం. ఈ మొత్తాన్ని పెంచాలన్నది రైతుల ఆశ. ఎన్డీఏ కీలక హామీ అయిన రైతు ఆదాయం రెట్టింపు కోసం చర్యలు తీసుకుంటారని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అధిగమించేనా..?

2018-19లో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 5.8 శాతానికి పడిపోయింది. ఆర్థిక మందగమనాన్ని అధిగమించి వ్యవస్థను పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆర్థిక మంత్రి ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఇదే​. అయితే 2019-20 ఏడాదికి భారత్​ 7% వృద్ధి రేటు సాధిస్తుందని పార్లమెంటులో ప్రవేశపెట్టినఆర్థిక సర్వే అంచనా వేసింది

బ్యాంకింగ్ వ్యవస్థలో నిరర్ధక ఆస్తులు పేరుకుపోతున్నాయి. విపణిలో వినియోగ గిరాకీ పడిపోతోంది. ఈ ప్రభావం పారిశ్రామిక రంగంపై తీవ్రంగా పడుతోంది. ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు తగ్గిపోతున్నాయి. వీటన్నింటినీ ఆర్థిక మంత్రి సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

నిరుద్యోగంపై యుద్ధం ఎలా..?

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. దేశంలో నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. కోట్లాది మంది యువత ఉపాధి కోసం వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు బడ్జెట్​లో సమర్థమైన చర్యలు తీసుకోవాలని దేశం మొత్తం ఆశిస్తోంది. ఉద్యోగాల సృష్టి, పరిశ్రమల స్థాపనకు ఊతమిచ్చే విధానాలను తీసుకురావాలని కోరుతోంది. ప్రభుత్వం సైతం బడ్జెట్​లో ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశముంది. సాంకేతికత వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నామన్న ఆందోళనలను దూరం చేయాల్సిన బాధ్యత సర్కార్​పై ఉంది.

మౌలిక వసతులపై రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. అందుకు తగినట్లు ఈ బడ్జెట్​లో ఏమేరకు కేటాయింపులు ఉంటాయన్నది ఆసక్తికరం.

అంచనాలివే..

ఈ ఏడాది ఫిబ్రవరిలో పీయూష్​ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్​కు ప్రస్తుత మంత్రి సీతారామన్​ పెద్దమార్పులేమీ చేసే అవకాశాలు లేవు. అయితే ఇటీవలి అంచనాలు, సంప్రదింపుల నేపథ్యంలో కొన్ని కొత్త నిర్ణయాలు వెలువడొచ్చు. ముఖ్యంగా అధిక శాతం మంది డిమాండ్​ చేస్తున్న ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే సంస్కరణలు వచ్చే అవకాశం ఉంది.

Last Updated : Jul 5, 2019, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details