తెలంగాణ

telangana

ETV Bharat / business

పన్ను ఉగ్రవాదంతో వ్యాపార భారతం ఉక్కిరిబిక్కిరి - tax

ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంస్కరణలు. వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు మరెన్నో చర్యలు. అవన్నీ ఎంతమేర ఫలితాలు ఇస్తున్నాయా? పన్నుల విషయంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి?

పన్ను ఉగ్రవాదంతో వ్యాపార భారతం ఉక్కిరిబిక్కిరి

By

Published : Aug 14, 2019, 6:13 PM IST

Updated : Sep 27, 2019, 12:30 AM IST

యూపీఏ ప్రభుత్వం పన్ను ఉగ్రవాదం పగ్గాలు విప్పింది. అనిశ్చితిని నెలకొల్పింది. వ్యాపారవర్గంలో ఆందోళన సృష్టించింది’. 2014 ఎన్నికల ప్రణాళికలో భారతీయ జనతాపార్టీ చేసిన విమర్శ ఇది. పన్నువసూలు యంత్రాగ ధోరణిపై వ్యాపార, వాణిజ్య వర్గాల్లో నెలకొన్న అసంతృప్తి, ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఆనాడు భాజపా నాయకత్వం కరుకైన పదజాలం వాడింది. తాము అధికారంలోకి వస్తే ఈ ఉగ్రవాదాన్ని లేకుండా చేయడమే కాకుండా అత్యంత వ్యాపార అనుకూల వాతావరణాన్ని స్పష్టిస్తామని స్పష్టీకరించింది.

2014 ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధించడంతో సంస్కరణలు ఊపందుకుంటాయని వ్యాపార, పారిశ్రామిక వర్గాలు ఆశపడ్డాయి. దానికి తగ్గట్లు కొన్ని చరిత్రాత్మక చర్యలు చేపట్టారు. అందులో మొదటిది వస్తుసేవల పన్ను చట్టం. బాలారిష్టాలు దాటుకుని ఈ పన్ను వ్యవస్థ గాడిలో పడుతోంది. నోట్లరద్దు నిర్ణయం రెండోది. నిజానికి దీన్ని ఎవరూ ఊహించలేదు.

నల్లధనాన్ని వెలుగులోకి తీసుకురావడానికి నోట్ల రద్దు తోడ్పడుతుందని భావించినా అనుకున్న ఫలితాలు రాలేదన్నది ఎక్కువమంది నిపుణుల భావన. ఆశించిన ఫలితం రాకపోగా ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకులకు లోనైంది. దాని ప్రభావం ఇంకా ఉందని వాదించే ఆర్థికవేత్తలూ ఉన్నారు. ఆర్థికాభివృద్థిలో అనుకున్నంత వేగం ఇప్పటికీ లేకపోవడానికి ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.

వస్తుసేవల పన్నుకు సమాంతరంగా ప్రత్యక్ష పన్ను వ్యవస్థలో గణనీయ సంస్కరణలు వస్తాయని పారిశ్రామిక వర్గాలు వేసుకున్న అంచనాలు ఇంకా నిజంకాలేదు. ఈలోగా కేఫ్‌ కాఫీడే అధిపతి వి.జి.సిద్ధార్థ ఆత్మహత్య కార్పొరేట్‌ ప్రపంచాన్ని ఓ కుదుపుకుదిపింది. వేలకోట్ల రూపాయల అప్పుల సమస్య సిద్ధార్థను ఉక్కిరిబిక్కిరి చేసి విపరీత నిర్ణయం తీసుకునేలా చేసింది. మరణానికి ముందు ఆయన రాసినట్లుగా చెబుతున్న నోట్‌లో ఆదాయపన్ను అధికారి వేధింపుల ప్రస్తావన ఉండటంతో దేశంలో మళ్ళీ పన్నుల వ్యవస్థపై చర్చ మొదలైంది.

నిజానికి సిద్ధార్థ మరణానికి ముందుగానే పన్ను ఉగ్రవాదం గురించి మాట్లాడిన నిపుణులు ఉన్నారు. రాజకీయకోణంలో కాకుండా సంస్కరణ దృష్టితో దాని గురించి మాట్లాడారు. స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటుపై మన అంచనాలన్నీ ఎక్కువేనంటూ కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యమ్‌ చెప్పినప్పుడూ పన్ను ఉగ్రవాదం గురించి చర్చ జరిగింది. 2011-2017 మధ్యకాలంలో జీడీపీ వృద్ధిరేటును రెండున్నర శాతం ఎక్కువగా అంచనా వేశామని అన్నప్పుడూ దానితో ఏకీభవించనివారు పన్ను ఆదాయంలో పెరుగుదలను ప్రస్తావించారు. దీనికి ప్రతిగా పన్ను ఉగ్రవాదం వల్లే ఆదాయం పెరిగిందంటూ కొందరు విమర్శలు చేశారు. ఈ వాదనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి.

ఒకటి మాత్రం నిజం. సరళమైన పన్ను వ్యవస్థను తీసుకొస్తామని, వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని సమూలంగా సంస్కరిస్తామని 2014లో భాజపా చెప్పినది నేటికీ పూర్తిగా పట్టాలకెక్కలేదన్నది సుస్పష్టం!

పన్నులకు సంబంధించి వివాదాలు తగ్గుముఖం పడితే వ్యవస్థ సరళీకృతమైందని అనుకోవచ్చు. 2017-2018 లెక్కల ప్రకారం పన్ను పరంగా వివాదంలో ఉన్న ఆదాయం రూ.6.24 లక్షల కోట్లు. ఇందులో దాదాపు 50 శాతం మొత్తం రెండేళ్లకు సంబంధించింది. ఇంత పెద్దమొత్తంపై వివాదం ఉండటం- పన్నుల వ్యవస్థ సక్రమంగా లేదనడానికి దాఖలా. పన్ను ఆదాయంపై అవాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోవడంతోపాటు, సత్వరం పరిష్కారం కాకుండా వివాదాలు వివిధ స్థాయుల్లో పేరుకుపోవడమూ ఇందుకు కారణం.

ఆదాయపన్ను అప్పీళ్ల కమిషనర్ల వద్ద కేసుల సంఖ్య 2014 మార్చిలో 2.15 లక్షలుంటే, 2019 మార్చినాటికవి 3.41 లక్షలకు పెరిగాయి. పోనీ అధికారులు విధించే పన్నులు, జరిమానాల కేసులు వివిధస్థాయుల్లో నిలుస్తున్నాయా అంటే అదీ లేదు. ప్రత్యక్షపన్ను కేసుల్లో 30 శాతమే ట్రిబ్యునళ్లు, కోర్టుల పరీక్షకు నిలబడుతున్నాయి. 70 శాతం కేసులు వీగిపోతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఏళ్లూపూళ్లూ పడుతుంది. దీనివల్ల ఎంతో సమయం, ఎన్నో వనరులు వృథా అవుతాయి. వీగిపోయే కేసులు ఎందుకు పెడుతున్నారని అధికారులను అడిగితే- మా టార్గెట్లు మాకున్నాయి. ఏమిచేస్తాం? అన్న సమాధానమే వస్తుంది.

2017-2018 కార్పొరేట్‌ పన్నుకు సంబంధించీ వివాదంలో ఉన్నదే ఎక్కువ. వివాదంలో లేని ఆదాయంతో పోల్చితే వివాదంలో ఉన్నది 5.8 రెట్లు అధికం. 2013-2014లో ఇలా వివాదంలో ఉన్నది 3.7 రెట్లే. ట్రిబ్యునళ్లు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఉన్న అప్పీళ్లలో 80 శాతానికి పైగా అధికారులు వేసినవే ఉన్నాయి. సుప్రీంకోర్టు వరకూ కేసు వెళితే అది పరిష్కారం కావడానికి సగటున 15 నుంచి 20 ఏళ్లు పడుతుంది. పన్నుకట్టే సంస్థలను ఇలా కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయడాన్నే ‘పన్ను ఉగ్రవాదంగా వ్యాఖ్యానిస్తున్నారు.

నాణానికి ఇది ఒకవైపు మాత్రమే. మరోవైపు ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఇంకా తక్కువే. జీడీపీలో ప్రత్యక్ష పన్ను శాతం 2017-2018లో 5.98 మాత్రమే. పన్నుల వ్యవస్థ సరళంగా ఉన్న దేశాలతో పోల్చితే ఇది బాగా తక్కువే. అన్నీ పద్ధతి ప్రకారం నడిపే కార్పొరేట్‌ సంస్థలు- ప్రభుత్వాలు పెట్టుకునే అధిక ఆదాయలక్ష్యాలను ఎక్కువగా మోయాల్సివస్తోంది.

మన ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ పాలు అవ్యవస్థీకృత రంగంలో ఉంది. ఏ లెక్కలూ ఇక్కడ పక్కాగా ఉండవు. జీఎస్టీ వచ్చినప్పటికీ ఎన్నో లావాదేవీలు పన్ను పరిధిలోకి రాకుండా నిర్వహిస్తున్నారు. జీఎస్టీ ప్రకారమైతే ఒక రేటుకు, బిల్లులేకుండా మరో రేటుకు దొరికే వస్తువులు కోకొల్లలు. వీటిమీదపోయే ఆదాయం చాలా ఎక్కువే. నల్లధనం ఎక్కువగా పోగయ్యేది ఈ రంగం నుంచే. స్థిరాస్తి రంగంలో వాస్తవ కొనుగోలు, అమ్మకాల్లో రికార్డులకు ఎక్కేది 50 శాతమైనా ఉండదు. ఆదాయ పన్ను చెల్లించేవారు దేశ జనాభాలో అయిదు శాతంలోపు ఉండటమే పరిస్థితి అస్తవ్యస్థతకు నిదర్శనం.

వస్తుసేవలన్నీ పన్ను పరిధిలోకి పకడ్బందీగా తీసుకురాగలితే భారం తగు మోతాదులో అన్ని రంగాలపై ఉంటుంది. పన్ను ఉగ్రవాదం అనే విమర్శలూ పోతాయి. వ్యవస్థీకృత రంగం ప్రస్తుతం చాలా ఒడుదొడుకులకు లోనవుతోంది. మౌలికరంగంలో పెద్దపెద్ద కంపెనీలో చేతులెత్తేస్తున్నాయి. బ్యాంకులూ నిరర్ధక ఆస్తులతో కుంగిపోతున్నాయి. పారుబాకీలు రూ.10 లక్షల కోట్లు పైబడ్డాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తరవాత చాలా రంగాలు రుణాల కొరతతో సతమతమవుతున్నాయి. అమెరికా-చైనా వాణిజ్యయుద్ధ ప్రభావం బహుముఖంగా కనబడుతోంది. చమురుధరలు పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు కీలకరంగాల్లో అమ్మకాలు ఆశించిన రీతిలో లేవు. ప్రభుత్వం పెద్దయెత్తున సంస్కరణలకు పూనుకొని రుణ సౌకర్యాలను మెరుగుపరచి, పన్ను వ్యవస్థను బాగా సరళీకరించకపోతే వేలమందికి ఉపాధి కల్పించిన సిద్ధార్థ లాంటివారు చాలా ఒత్తిళ్లకు లోనవుతారు. ప్రపంచీకరణ ఫలితంగా అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడాల్సిన పరిస్థితుల్లో పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అప్పుడప్పుడే ఎదుగుతున్న పరిశ్రమలకు ఒకప్పుడు ప్రభుత్వాలు అనుచితపోటీ ఎదురుకాకుండా రక్షించేవి. బ్రిటన్‌ పారిశ్రామిక వర్గం ప్రపంచశక్తిగా ఎదిగింది అలాగే. భారత చేనేత ఉత్పత్తులపై విపరీత పన్నులు వేసి బ్రిటన్‌ విపణిలో వాటికి చోటులేకుండా చేశారు. సొంత మార్కెట్‌లో పోటీలేకుండా చేసుకున్న తరవాత మనదేశంలో స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో బ్రిటన్‌ ఉత్పత్తులకు తలుపులు బార్లా తెరిచారు. చౌక ఉత్పత్తులతో చేనేత పరిశ్రమను చావుదెబ్బ తీశారు. అమెరికా కూడా తన పరిశ్రమలు మొగ్గతొడిగే క్రమంలో వాటిని పోటీ నుంచి కాపాడి ఎదగడానికి ఎన్నో చర్యలు చేపట్టింది.

మన దేశంలో వేలకోట్లు పెట్టుబడులు పెట్టగల బహుళజాతి సంస్థలతో పోటీపడాల్సిన పరిస్థితి దేశీయ పరిశ్రమలకు ఉంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య పోటీయే ఇందుకు నిదర్శనం. మితిమీరిన అధికారాలతో కూడిన పన్నుల వ్యవస్థ సమూలంగా సంస్కరణ చెందడం ఇలాంటి పోటీ వాతావరణంలో ప్రాణావసరం. అందుకు అడుగులు వేగంగా పడాలి!

- ఎన్‌.రాహుల్‌ కుమార్‌

Last Updated : Sep 27, 2019, 12:30 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details