వరుసగా ఎనిమిదో ద్వైమాసిక సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయలేదు ఆర్‌బీఐ. రెపో రేటును 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్ద యథాతథంగా కొనసాగించేందుకే ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మొగ్గు చూపినట్లు ఆర్‌బీఐ గరర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న సంకేతాలు ఉన్నప్పటికీ ఆర్‌బీఐ సర్దుబాటు వైఖరిని కొనసాగించడం గమనార్హం. రెపో, రివర్స్ రెపో రేట్లను చివరి సారిగా .. 2020 మేలో సవరించింది ఆర్‌బీఐ. కరోనా నేపథ్యంలో ఇంతటి అత్యల్ప స్థాయికి వడ్డీ రేట్లను తగ్గించింది. అయితే కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునేందుకు ఊతమందించే దిశగా.. అప్పటి నుంచి కీలక వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ వస్తోంది.
గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన.. ఎంపీసీ సమీక్ష బుధవారం (అక్టోబర్ 6న) ప్రారంభమైంది. మూడు రోజుల సమీక్షలో వడ్డీ రేట్లు సహా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను శక్తికాంతాదాస్ తాజాగా వెల్లడించారు.
దాస్ ప్రకటనలోని ముఖ్యాంశాలు..
- భారీ ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ) కస్టమర్ల సమస్యల పరిష్కారానికి అంతర్గత అంబూడ్స్మన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.
- ఐఎంపీఎస్ విధానం ద్వారా నగదు బదిలీ పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు 9.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటును 17.1 శాతంగా నిర్దేశించుకుంది.
- పెట్టుబడుల్లో కూడా స్పష్టమైన పునరుద్ధరణ సంకేతాలు కనిపిస్తున్నాయి. గిరాకీ పుంజుకుంటోంది. పండుగ సీజన్‌లో పట్టణ ప్రాంతాల్లో గిరాకీ మరింత వేగంగా ఊపందుకుంటుందని భావిస్తున్నామని దాస్ వెల్లడించారు.
- ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కీలక ద్రవ్యోల్బణం లక్షిత పరిధిలోనే ఉందన్నారు దాస్. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగానే ఉందని పేర్కొన్నారు.
- చివరి ద్రైమాసిక పరపతి విధాన సమీక్ష నాటితో పోలిస్తే ఆర్థికంగా భారత్ ప్రస్తుతం మెరుగైన స్థాయిలో ఉందని ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు.
- క్యాపిటల్ గూడ్స్‌కి గిరాకీ పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను సూచిస్తోంది.
- ఈ ఆర్థిక సంవత్సర రిటైల్ ద్రవ్యోల్బణ (సీపీఐ) లక్ష్యాన్ని 5.7 శాతం నుంచి 5.3 శాతానికి ఆర్‌బీఐ సవరించింది. జులై-సెప్టెంబరులో సీపీఐ అంచనాల కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక లక్ష్యాన్ని కూడా 5.3 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గించింది ఆర్‌బీఐ.
ఇదీ చదవండి:సామాన్యుడికి చుక్కలు- మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు