భారతీయ రిజర్వు బ్యాంక్... కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశం ఉంది. రాబోయే ద్రవ్య పరపతి విధాన సమీక్ష(ఎంపీసీ)లో ప్రస్తుతమున్న స్థితినే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఆర్‌బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన మానిటరీ పాలసీ కమిటీ ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు సమీక్ష జరపనుంది. అక్టోబర్ 1న ఎంపీసీ తన నిర్ణయాలను వెలువరించనుంది.
గతంలోనూ యథాతథం..
ఆగస్టులో జరిగిన ఎంపీసీ భేటీలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఆర్‌బీఐ ఉంచింది. ఫిబ్రవరి నుంచి దాదాపు 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ద్రవ్యోల్బణం అదుపునకు గతసారి వడ్డీరేట్ల జోలికి పోలేదు ఆర్‌బీఐ. ఈ సారీ అదే పద్ధతిని పాటించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే సూచనలు కనిపించే వరకు ఎలాంటి కోతా ఉండకపోవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ పేర్కొంది.