ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టటం ఓ ప్రధాన మార్గం. అయితే స్టాక్స్ ఎక్కువ రిస్కుతో కూడినవి కాబట్టి వీటిలో పెట్టుబడులు పెట్టే సమయంలో చాలా జాగ్రత్త అవసరం. వీటిలో మదుపు చేసే ముందు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.
లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
పెట్టుబడుల ఏవైనా వాటితో లక్ష్యం అనేది ఉండాలి. స్వల్ప నుంచి మధ్య కాలంలో ప్రయాణాలు, పిల్లల చదువులు, పెళ్లి తదితర స్వల్ప నుంచి మధ్యకాల లక్ష్యాలు ఉండవచ్చు. అంతేకాకుండా భవిష్యత్త్ తరాలకు సంపదను అందించేందుకు దీర్ఘకాల లక్ష్యాలు ఉండవచ్చు.
అయితే ఈ విషయాన్ని స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే వారు తప్పకుండా ముందే నిర్ణయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల పెట్టుబడిదారులు రిస్కును సమర్థంగా నిర్వహించుకోవటానికి వీలవుతుందని చెబుతున్నారు. ఫలితంగా తగిన స్టాక్స్ ఎంచుకుని మెరుగైన రాబడులను సాధించుకోవచ్చని వారు అంటున్నారు.
రిస్కు, వ్యవధి..
రిస్కు తీసుకునే సామర్థ్యం ఎంత అన్నది కూడా ముందే నిర్ణయించుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల ఎలాంటి స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవాలన్న దానిపై స్పష్టత ఉంటుందని వారు చెబుతున్నారు. పెట్టుబడిని కొనసాగించే వ్యవధి కూడా చాలా ముఖ్యమైనది. వ్యవధిని బట్టి రాబడులు ఆధారపడి ఉంటాయి.