ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టాక దేశ చరిత్రలోనే తొలిసారి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నిర్మలా సీతారామన్. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా వచ్చే నెల 5 న 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం బడ్జెట్ ముందస్తు సంప్రదింపులను ముమ్మరం చేసింది ఆర్థిక శాఖ.
ఈ నెల 11 నుంచి 23 వరకు ఆర్థికవేత్తలు, పారిశ్రామిక రంగం ప్రతినిధులు, బ్యాంకు వర్గాలతో భేటీ కానున్నారు విత్తమంత్రి సీతారామన్. బడ్జెట్ ముందస్తు సంప్రదింపులను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుల సమావేశంతో ప్రారంభించనున్నారు సీతారామన్. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై వారి సలహాలు తీసుకోనున్నారు.
ఆర్థిక వృద్ధి మందగమనం, నిరర్థక ఆస్తులు, బ్యాంకింగేతర ఆర్థిక రంగాల్లో నిధుల కొరత, ఉద్యోగ కల్పన, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతుల పునరుద్ధరణ, వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వ పెట్టుబడుల వంటి విషయాలు బడ్జెట్ రూపకల్పనలో కీలకంగా మారాయి.
జీఎస్టీ సమావేశంలో..
జూన్ 20న జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే బడ్జెట్‌పై రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సలహాలు, సూచనలు స్వీకరించే అవకాశం ఉంది.