తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఉత్పాదక రంగాలకు మరిన్ని రుణాలు' - NBFCs in India

కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే చర్యల్లో భాగంగా బుధవారం బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీ అధిపతులతో దృశ్యమాధ్యమం ద్వారా ద్వారా సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆర్థిక రంగ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని నొక్కిచెప్పారు. ఉత్పాదక రంగాలకు మరిన్ని రుణాలు ఇవ్వాలని దిగ్గజ బ్యాంకర్లకు ప్రధాని దిశా నిర్దేశం చేశారు.

PM Modi holds meeting with heads of banks, NBFCs
'ఆర్థిక వృద్ధిలో బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలది కీలక పాత్ర'

By

Published : Jul 30, 2020, 5:05 AM IST

కొవిడ్‌ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు వీలుగా ఉత్పాదక రంగాలకు మరిన్ని రుణాలు ఇవ్వాలని దిగ్గజ బ్యాంకర్లకు ప్రధాని నరేంద్ర మోదీ దిశా నిర్దేశం చేశారు. బుధవారం 3 గంటల పాటు దృశ్యమాధ్యమ విధానంలో ప్రధాని బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ప్రభుత్వ-ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకుల ముఖ్య కార్యనిర్వహణాధికారులు (సీఈఓ), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆత్మనిర్భర్‌ భారత్‌ సాకారం చేయడంలో ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతను ఈ సమావేశంలో నొక్కి చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్థిక రంగానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు.

  • రుణ పథకాలు, అవి సమర్థంగా అవసరార్థులకు చేరేందుకు అవలంబించాల్సిన విధానాలు, సాంకేతికత ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించడం, ఆర్థిక రంగ స్థిరత్వం, సుస్థిరతకు ఎలాంటి పద్ధతులు పాటించాలి అన్న అంశాలపై ఈ సమావేశం దృష్టి సారించింది. ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌, పీఎన్‌బీ ఎండీ ఎస్‌.ఎస్‌.మల్లికార్జునరావు, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ సందీప్‌ భక్షి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ ఆదిత్య పురి, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ ఎండీ రేణు సూద్‌ కర్నాడ్‌ సహా మరికొందరు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
  • చిన్న వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలు, రైతులు రుణాల కోసం ప్రైవేటు వ్యక్తులను కాక బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆశ్రయించేలా వారికి చేరువవ్వాలి. ప్రతి బ్యాంకు కూడా రుణాల్లో స్థిర వృద్ధి నమోదయ్యే మార్గాలు అన్వేషించాలి.
  • అన్ని ప్రతిపాదనలను ఒకే గాటన కట్టకుండా, ఆయా రుణ ప్రతిపాదనలను క్షుణ్నంగా పరిశీలించి, అర్హత ఉన్నవారికి రుణాలివ్వాలి. గతంలో ఆయా విభాగాలకు ఇచ్చిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారాయనే భావన విడనాడాలి.
  • డేటా మొత్తాన్ని ఒకేచోట నిల్వ ఉంచే వ్యవస్థలను బ్యాంకులు సమకూర్చుకోవాలి. పత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించడం, కొత్త ఖాతాదారులను చేర్చుకోవడంలో కూడా డిజిటల్‌ పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలి. ఇందువల్ల రుణాల జారీ కూడా సులభమవుతుంది. బ్యాంకులకు వ్యయాలు తగ్గుతాయి, ఖాతాదార్లకు కార్యకలాపాలు సులభమవుతాయి. మోసాల నుంచి తప్పించుకోవడం సులభమవుతుంది.
  • అత్యంత చౌకగా కార్యకలాపాలు సాగించే వీలున్న యూపీఐ, రూపే వ్యవస్థలను ఎక్కువమంది వాడేలా చూడాలి.
  • కొవిడ్‌ సంక్షోభం వల్ల మే నెలలో బ్యాంకు రుణాల్లో వృద్ధి 7 శాతానికి పరిమితమైంది. 2019 మే నెలలో ఇది 11.5 శాతం కావడం గమనార్హం. అనిశ్చితి నేపథ్యంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల్లో వృద్ధి మందగమనంలోనే సాగుతుందని, రుణ గ్రహీతలు, దాతలకు నష్టభయాలు తప్పవనే అంచనాలున్నాయి.
  • రుణ వృద్ధి పెంచేందుకు ఆర్‌బీఐ బెంచ్‌మార్క్‌ రుణ రేటును చారిత్రాత్మక కనిష్ఠమైన 4 శాతానికి చేరింది. అయినా కూడా కార్పొరేట్‌ సంస్థలతో పాటు రిటైల్‌ వినియోగదారులు కూడా రుణాలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. నిధులు మిగిలి పోతున్నందున, బ్యాంకర్లు తమ నిధులను ఆర్‌బీఐ వద్ద రిజర్వ్‌ రెపో పద్ధతిలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details