తెలంగాణ

telangana

ETV Bharat / business

నమ్మకంలో నంబర్ 1 - సీసీఐ

వినియోగదారుల నమ్మకంలో భారత్​ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. 64 దేశాల్లో చేసిన సర్వేలో ఫిలిప్పీన్స్ రెండో స్థానంలో​, ఇండోనేషియా మూడో స్థానంలో నిలిచాయి.

నమ్మకంలో నంబర్ 1

By

Published : Mar 4, 2019, 4:13 PM IST

వినియోగదారుల నమ్మకంలో భారతదేశం మళ్లీ అగ్రస్థానం కైవసం చేసుకుంది. నీల్సన్​ సహకారంతో కాన్ఫరెన్స్​ బోర్డు విడుదల చేసిన అంతర్జాతీయ వినియోగదారుల నమ్మక సూచీ(సీసీఐ) ఈ విషయాలను వెల్లడించింది.

64 దేశాల్లో అంతర్జాలం ఆధారంగా నిర్వహించిన సర్వేలో మొత్తం 32,000 మంది పాల్గొన్నారు. ఈ సర్వేలో వచ్చే 12 నెలలకు సంబంధించి అంతర్జాతీయంగా ఉద్యోగాలపై ప్రజల దృక్పథం, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ, ఖర్చు పెట్టే తీరును గమనించారు.

2018 నాలుగో త్రైమాసికానికి సంబంధించి భారత్​ స్కోరు 133. 131 స్కోరుతో ఫిలిప్పీన్స్​ రెండో స్థానంలో, 127 స్కోరుతో ఇండోనేషియా మూడో స్థానంలో నిలిచాయి.

2018 మూడో త్రైమాసికంలోనూ భారత్​ 130 స్కోరుతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ 126 స్కోరుతో ఉమ్మడిగా నాలుగో స్థానాన్ని పంచుకున్నాయి.

ఆసియాలో పెరిగిన నమ్మకం...

ఆసియా-పసిఫిక్​ ప్రాంతంలో సీసీఐ స్కోరు 3 పాయింట్లు పెరిగి 117కు చేరింది. ప్రధాన మార్కెట్లైన చైనా, భారత్​, జపాన్​, ఇండోనేషియాలో వినియోగదారుల నమ్మకం పెరిగింది.

చైనాలో వినియోగదారులు సానుకూలంగా ఉన్నా... కొనుగోళ్లు తగ్గిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాతో వాణిజ్య యుద్ధమే ఇందుకు కారణం.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​, సింగపూర్​, హాంగ్​కాంగ్​ లాంటి దేశాల్లో వినియోగదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నప్పటికీ.. వ్యాపారంలో మంచి అవకాశాలు ఉన్నట్లు సర్వే అంచనా వేసింది.

నిరాశలో దక్షిణ కొరియా...

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా నిరాశలో ఉన్న వినియోగదారులు దక్షిణ కొరియాలో ఉన్నారు. ఈ దేశంలో ధరలు పెరుగుదల, జీతాలు సరిగా పెరగకపోవడం, స్టాక్​ మార్కెట్లు బలహీనంగా ఉండటం, నిరుద్యోగం, అంతర్జాతీయ వాణిజ్యంలో సందిగ్ధతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

అంతర్జాతీయంగా పెరిగింది..

అంతర్జాతీయ సీసీఐ స్కోరు ఒక పాయింటు పెరిగి 107కు చేరింది. ఇది గత 14 ఏళ్లలో అత్యధికం కావటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా సగటు వినియోగదారుడి సెంటిమెంటు సానుకూలంగా ఉంది.

అంతర్జాతీయంగా ఉద్యోగాలు, వ్యక్తిగత ఫైనాన్స్​పై ప్రజలు సానుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చు పెట్టే వాతావరణంపై ప్రతికూల పవనాలు ఉన్నట్లు అంచనా వేసింది సర్వే. అధిక ముడిచమురు ధరల వల్ల ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ వాణిజ్యంలో సందిగ్ధత, వివిధ దేశాల కరెన్సీ విలువ పడిపోవటం, వడ్డీ రేట్లు పెరగటమే కారణమని తెలిపింది.

ప్రపంచ వృద్ధికి ఊతం..

నమ్మకం సూచీలు స్వల్ప కాలంలో వినియోగదారుల ఖర్చును అంచనా వేయటానికి ఉపయోగపడతాయి. ప్రజల సెంటిమెంటు సానుకూలంగా ఉన్నందున ప్రపంచ వృద్ధి పెరిగే అవకాశం ఉంది.

అదే సమయంలో వాణిజ్య యుద్ధం, వడ్డీ రేట్లు పెరుగుదల, ద్రవ్యోల్బణ ఒత్తిడి, చమురు ధరల్లో అనిశ్చితి వృద్ధిని ప్రభావితం చేయనున్నాయి.

అంతర్జాతీయ ద్రవ్య నిధి గణాంకాల ప్రకారం... ప్రపంచ వృద్ధి 2016లో 3.3 శాతం, 2018లో 3.7 శాతంగా ఉంది. 2018 సంవత్సరంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధి 4.7 శాతంగా ఉండగా... అభివృద్ధి చెందిన దేశాల్లో 2.4 శాతమే నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details