కరోనా సంక్షోభం కారణంగా అసంఘటిత రంగంలోని 160 కోట్ల మంది కార్మికులపై ప్రభావం పడుతుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) లెక్కగట్టింది. ఈ సంఖ్య ప్రపంచ శ్రామిక శక్తిలో సగమని తెలిపింది. పనిగంటల తగ్గింపు వల్ల వీరంతా జీవనోపాధి కోల్పోనున్నారని ఐఎల్ఓ అంచనా వేసింది.
బుధవారం విడుదల చేసిన 'కొవిడ్- 19 అండ్ ద వరల్డ్ ఆఫ్ వర్క్' మూడో నివేదికలో పలు విషయాలు వెల్లడించింది ఐరాస అనుబంధ సంస్థఅయిన ఐఎల్ఓ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 43 కోట్ల వ్యాపారాలు కరోనా సంక్షోభంలో చిక్కుకుపోయాయని పేర్కొంది. రిటైల్, తయారీ రంగాలు ప్రమాదంలో పడ్డాయని తెలిపింది.
ఇదీ పరిస్థితి..
అంతర్జాతీయంగా 330 కోట్ల మంది ఉద్యోగుల్లో 200 కోట్ల మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నట్లు ఐఎల్ఓ పేర్కొంది. వీరిలో 160 కోట్ల మంది జీవనానికి సరిపడా ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అంచనా వేసింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుంటుందని హెచ్చరించింది.
"కోట్ల మంది కార్మికులకు ఆదాయం లేదు. అంటే ఆహారం లేనట్లే. ఫలితంగా వారి భద్రత, భవిష్యత్తు శూన్యం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది వ్యాపారాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. వాటికి మిగులు లేకపోగా.. రుణాలు అందే పరిస్థితి కూడా లేదు. ఇదే ప్రస్తుత ప్రపంచ ముఖచిత్రం. ఈ సమయంలో మేం ఎలాంటి సాయం చేయలేకపోతున్నాం. వినాశనం తప్పదు."
- గయ్ రైడర్, ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్