తెలంగాణ

telangana

By

Published : Jan 5, 2020, 4:33 PM IST

ETV Bharat / business

చిరు వ్యాపారుల పెన్షన్ పథకానికి ఆదరణ కరవు!

కేంద్రం ప్రవేశపెట్టిన చిరు వ్యాపారుల, స్వయం ఉపాధిదారుల పెన్షన్ పథకం ఆదరణకు నోచుకోలేకపోతోంది. గతేడాది జులై 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకంలో ఇప్పటి వరకు 25 వేల మంది మాత్రమే చేరారు. 2020 మార్చి కల్లా 50 లక్షల మంది ఈ పథకంలో చేరతారని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం.

PENSION SCHEME
చిరు వ్యాపారుల పెన్షన్ పథకానికి ఆదరణ కరవు!

వ్యాపారులు, స్వయం ఉపాధిదారుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ పెన్షన్ పథకానికి ఆదరణ కరవైంది. ఈ ఏడాది మార్చిలోపు మొత్తం 50 లక్షల మందిని ఈ పథకం కిందకు తీసుకురావాలని భావించింది కేంద్రం. అయితే ఇప్పటి వరకు ఈ పథకానికి దేశ వ్యాప్తంగా 25,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.

ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశ రాజధాని దిల్లీ నుంచి 84 మంది వ్యాపారులు, స్వయం ఉపాధిదారులు మాత్రమే ఈ పథకానికి నమోదు చేసుకున్నారు. కేరళ నుంచి 59, హిమాచల్ ప్రదేశ్​ నుంచి 54, జమ్ముకశ్మీర్​ నుంచి 29 మంది దరఖాస్తు చేసుకున్నారు. గోవా నుంచి ఇద్దరు దరఖాస్తు చేసుకోగా.. సిక్కిం, లక్ష్యద్వీప్​ నుంచి కనీసం ఒక్క దరఖాస్తు అందలేదని ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది.

అత్యధికంగా చూస్తే.. ఉత్తర్​ప్రదేశ్​ (6,765), ఆంధ్రప్రదేశ్​ (4,781), గుజరాత్​ (2,915), మహారాష్ట్ర (632), బిహార్​ (583), తమిళనాడు (309), మధ్య ప్రదేశ్​ (305), బంగాల్​లో​ (234) మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు.

ఇంతకీ ఏంటి ఈ పథకం..

చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధిదారులకు పెన్షన్ ఇచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. 'ప్రధాన్​ మంత్రి లఘు వ్యాపారి మాన్​-ధన్​ యోజన' పేరుతో ఈ పథకాన్ని తీసుకువచ్చింది.

18 నుంచి 44 ఏళ్ల వయస్సు వారిని ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు వయస్సుల వారీగా చెల్లించే ప్రీమియంకు సమాన మొత్తంలో కేంద్రం వారి తరఫున జమ చేస్తుంది. ఆ తర్వాత 60 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.3,000 పెన్షన్​ ఇవ్వాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 2019 జులై 22 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది.

ఆదరణ తగ్గడానికి కారణాలివే..

ఈ పథకానికి అర్హత వయస్సు తక్కువగా ఉండటమే ఆదరణ తగ్గేందుకు కారణమని అఖిల భారత వ్యాపారుల కార్యదర్శి ప్రవీణ్​ కందేల్ వాల్​ తెలిపారు.
ముఖ్యంగా 40 నుంచి 55 వయస్సుల వారికి ఈ పథకంలో అర్హత కల్పించి.. ప్రీమియం పెంచితే ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశముందన్నారు.

ఇదీ చూడండి:స్మార్ట్​ ఫోన్లలో 'నావిక్​' ఫీచర్​.. షియోమీతో ఇస్రో ఒప్పందం!

ABOUT THE AUTHOR

...view details