ఈ ఫొటో చూశారా? ఇక్కడ అందరి లక్ష్యం ఒక్కటే... 40 రోజుల దాహం తీర్చుకోవడం. ఎవరికీ కరోనా భయం లేదు. మాస్కులు సక్రమంగా ధరించి, జాగ్రత్తపడదామన్న ఆలోచన లేదు. భౌతిక దూరం పాటించే ఉద్దేశం అసలే లేదు. ఒకరిపై ఒకరు పడుతూ.. తోసుకుంటూ... 'నిషా'ను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. లాక్డౌన్ 1.0, 2.0లో రోడ్లపైకి అనవసరంగా వచ్చిన వారికి వినూత్న శిక్షలు విధించిన పోలీసులు... ఇప్పుడు మాత్రం మిన్నకుండిపోయారు.
కరోనా భూతంతో ఇలా చెలగాటం ఆడడం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఎందుకిలా? 40 రోజుల లాక్డౌన్ను అత్యంత పకడ్బందీగా అమలు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... 3వ దశలో మాత్రం ఎందుకు ఇంత సాహసం చేశాయి? సమాధానం ఒక్కటే... మద్యం నుంచి భారీగా వచ్చే ఆదాయం.
"లాక్డౌన్ అమలుతో దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ శాతం ఆదాయం మద్యం అమ్మకాల ద్వారానే వస్తుంది. ఇది ప్రభుత్వానికి కాస్త ఊరటనిచ్చే అంశం."
-డీఎన్ రైనా, ఆల్ ఇండియా డిస్టిలరీస్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్