కరోనా సంక్షోభం తర్వాత దేశంలో ఆర్థిక అసమానతల అంతరం భారీగా తగ్గొచ్చని ఎస్బీఐ అధ్యయనంలో వెల్లడైంది. ధనిక రాష్ట్రాల అదాయం.. పేద రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా తగ్గొచ్చని తేలింది.
కరోనాతో భారత్‌లో బెర్లిన్ యుద్ధం నాటి స్థితి!
కరోనాతో నెలకొన్న సంక్షోభం తర్వాత దేశంలో ఆర్థిక అసమానతల అంతరం తగ్గొచ్చని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది. లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని పేర్కొంది. వీటితో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యక్తిగత ఆదాయాలపై పలు కీలక విషయాలను వెల్లడించింది ఈ సర్వే.
పర్ క్యాపిటాపై ఎస్బీఐ అంచనాలు
నివేదికలోని కీలకాంశాలు:
- జాతీయ తలసరి ఆదాయం (పీసీఐ) 2020-21లో 5.4 శాతం తగ్గి.. రూ.1.43 లక్షలకు చేరొచ్చు.
- 1989 బెర్లిన్ యుద్ధంతో జర్మనీలో నెలకొన్న పరిస్థితుల్నే భారత్ ఎదుర్కోవచ్చు.
- నామినల్ జీడీపీ 3.8 శాతం తగ్గుదల కన్నా.. పీసీఐ క్షీణత అధికంగా ఉండొచ్చు.
- ప్రపంచవ్యాప్తంగా 2020లో తలసరి జీడీపీ 6.2 శాతం క్షీణిస్తుంది. ఇది ప్రపంచ వాస్తవిక జీడీపీ తగ్గుదల (5.2 శాతం) కన్నా తక్కువ.
- ధనిక రాష్ట్రాలు (దేశీయ సగటు కన్నా ఎక్కువ తలసరి ఆదాయం ఉండే రాష్ట్రాలు) పీసీఐ పరంగా ఎక్కువ ప్రభావితమవుతాయి.
- దిల్లీ (-15.4 శాతం), చంఢీగఢ్ (-13.9 శాతం) మేర అధిక క్షీణతను నమోదు చేయొచ్చు.
- మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రెండు అంకెల పీసీఐ క్షీణతను చవిచూడొచ్చు.
- పట్టణ ప్రాంతాలపై లాక్డౌన్ ప్రభావం తీవ్రంగా పడింది. మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్ వంటివి మూత పడటం వల్ల ఈ ప్రాంతాల్లో ఆదాయం భారీగా పడిపోయింది.
- లాక్డౌన్ సడలింపులతో మార్కెట్లు, మాల్స్ తెరుచుకున్నా.. సాధారణ సమయాలతో పోలిస్తే వినియోగదారుల తాకిడి 70-80 శాతం తగ్గింది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడులో పీసీఐ 10-12 శాతం తగ్గే అవకాశం ఉంది.
- మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో పీసీఐ 8 శాతం కన్నా తక్కువగా నమోదు కావచ్చు.
- 2020-21లో దేశ జీడీపీ 6.8 శాతం క్షీణతను నమోదు చేయొచ్చు.
- దేశ ఆర్థిక వ్యవస్థ.. కరోనాకు ముందున్న స్థాయికి చేరుకునేందుకు కనీసం 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు సమయం పట్టొచ్చు.