తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ ఏడాది మరింత పెరగనున్న బంగారం ధర! - బంగారం ధరలు

ఆర్థిక మందగమనం, ధరల్లో అనూహ్య వృద్ధి వంటి పరిణామాలతో 2019లో బంగారం డిమాండ్ 9 శాతం తగ్గింది. గత ఏడాది భారత పసిడి గిరాకీ 690.4 టన్నులకు పరిమితమైనట్లు వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్ తెలిపింది. అయితే బంగారం డిమాండ్​కు 2020 ఆశాజకంగా ఉన్నట్లు అభిప్రాయపడింది.

gold
బంగారం గిరాకీ

By

Published : Jan 30, 2020, 1:23 PM IST

Updated : Feb 28, 2020, 12:43 PM IST

దేశంలో గత ఏడాది బంగారానికి డిమాండ్​ భారీగా తగ్గింది. 2019లో పసిడి గిరాకీ 9 శాతం క్షీణతతో 690.4 టన్నులకు పరిమితమైంది. దేశీయంగా పసిడి ధరలు ఆకాశాన్నంటడం, ఆర్థిక మందగమనం వంటి పరిస్థితుల ఇందుకు కారణంగా ప్రపంచ పసిడి మండలి(డబ్ల్యూజీసీ) వెల్లడించింది.

ఈ ఏడాది ఆశాజనకమే..

2020లో మాత్రం పసిడి డిమాండ్​ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. ప్రపంచంలో చైనా తర్వాత బంగారానికి అతిపెద్ద వినియోగదారు అయిన భారత్​లో ఈ ఏడాది డిమాండ్​ 700-800 టన్నులకు చేరొచ్చని లెక్కగట్టింది. ధరలు పెరిగినా ప్రజలు కొనుగోళ్లు జరపడం, ప్రభుత్వం తీసుకువచ్చే ఆర్థిక సంస్కరణలు ఇందుకు ఊతమందించే అవకాశముందని పేర్కొంది.

ధరల వృద్ధి ఇలా..

గత ఏడాది 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.39,000లకు పైగా పెరిగింది. 2018తో పోలిస్తే.. 2019లో పెరిగిన ధరలు దాదాపు 24 శాతం అధికం.
'దేశీయంగా రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు.. బలహీన ఆర్థిక సంకేతాలు గతేడాది పసిడి విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. ధన త్రయోదశి లాంటి శుభదినాల్లోనూ కొనుగోళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అయితే పెళ్లిళ్ల సీజన్‌ ముందు మాత్రం డిమాండ్ కాస్త పెరిగింది' అని డబ్ల్యూజీసీ భారత వ్యవహారాల ఎండీ సోమసుందరం అన్నారు.

ఈ ఏడాది కేంద్రం తీసుకునే విధాన, నిర్ణయాత్మక చర్యలతో బంగారం పరిశ్రమ మరింత పారదర్శకంగా మారతుందని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం ఇప్పటికే బంగారు నగలకు హాల్​మార్కింగ్​ తప్పని సరి చేసింది. ఈ ఏడాది జనవరి 15 నుంచే ఈ విధానం అమలులోకి వచ్చింది. హాల్​మార్క్​ లేని నగలు అమ్ముకునేందుకుగాను వ్యాపారులకు ఏడాది వరకు గడవు ఇచ్చింది. భారత బంగారంపై విశ్వాసం పెంచేందుకు ఈ సంస్కరణ తోడ్పడతుందని తెలిపారు సోమసుందరం.

2019 లెక్కలు..

పసిడి డిమాండ్​ 2018లో 760.4 టన్నులుగా ఉండగా అది.. 2019లో 9 శాతం క్షీణతతో 690.4 టన్నులకు చెరింది.
పుత్తడి నగల డిమాండ్​ కూడా 9 శాతం క్షీణతతో 2019లో 544.6 టన్నులకు చేరింది. 2018లో పసిడి నగల గిరాకీ 598 టన్నులుగా ఉంది.
బంగారం కడ్డీలు, నాణేల డిమాండ్ 2019లో ఏకంగా 10 శాతం క్షీణించి 145.8 టన్నులుగా నమోదైంది. 2018లో వీటి గిరాకీ​ 162.4 టన్నులుగా ఉంది.

డిమాండ్​ తగ్గినా పెరిగిన విలువ..

గత ఏడాది పసిడి డిమాండ్ విలువ పరంగా చూస్తే 3 శాతం వృద్ధి నమోదైంది. 2019లో పుత్తడి డిమాండ్​​ విలువ రూ.2,17,770 కోట్లుగా నమోదైంది. 2018లో ఈ విలువ రూ.2,11,860 కోట్లుగా ఉంది.

దిగుమతులూ డీలా..

2019లో పసిడి దిగుమతులూ పడిపోయాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే.. గత ఏడాది పసిడి దిగుమతులు 14 శాతం తగ్గి.. 646.8 టన్నులకు పరిమితమయ్యాయి. 2018లో 755.7 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది భారత్​.

స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం సహా రిసైకిల్‌ చేసిన పుత్తడి విలువ 37శాతం పెరగడం కారణంగా దిగుమతులు తగ్గినట్లు డబ్ల్యూజీసీ తెలిపింది. అయితే బంగారం దిగుమతులపై ప్రభుత్వం విధించిన 12.5శాతం కస్టమ్స్‌ సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తే దిగుమతులు పుంజుకుంటాయని అంటోంది గోల్డ్​ కౌన్సిల్​.

ఇదీ చూడండి:సత్య నాదెళ్ల ప్లాన్​ హిట్... మైక్రోసాఫ్ట్​కు లాభాల పంట

Last Updated : Feb 28, 2020, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details